బంగిజంప్ చేసేదెప్పుడూ.. | Entertainment Machine Bungee Jumping in Adilabad | Sakshi
Sakshi News home page

బంగిజంప్ చేసేదెప్పుడూ..

Published Sat, Aug 20 2016 1:03 PM | Last Updated on Sun, Sep 2 2018 4:41 PM

బంగిజంప్ చేసేదెప్పుడూ.. - Sakshi

బంగిజంప్ చేసేదెప్పుడూ..

 గాలిలో ఎగిరేందుకు ఎదురుచూపులు..
 నెలలు గడుస్తున్నా కనిపించని పనులు
 కేంద్ర అనుమతికి నివేదిక పంపామంటున్న అధికారులు
 సోన్ బ్రిడ్జివద్ద ఏర్పాటు చేస్తామన్న పర్యాటకశాఖ
 
నిర్మల్‌ రూరల్ : పచ్చని అడవులతో.. స్వచ్ఛమైన ప్రకృతిని కళ్లకు కట్టి చూపుతుంది ఆదిలాబాద్‌ జిల్లా. కొండలు, కోనల గుండా గలగల పారే సెలయేళ్లు.. ఎగిరేపడే జలపాతాల అందాలతో ఇట్టే ఆకట్టుకుంటుంది ఈ అడవుల ఖిల్లా. దక్షిణ కశ్మీరంగా ఖ్యాతికెక్కినా.. పర్యాటకపరమైన అభివృద్ధి మాత్రం అసలు కశ్మీరమంతా దూరంలో ఉంది. పాలకుల పట్టింపులేనితనం.. అధికారుల అలసత్వం ఆదిలాబాద్‌ను పర్యాటకపరంగా వెనుకబడేస్తున్నాయి. దీనికి సోన్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేస్తామన్న బంగిజంపే నిదర్శనం. తెలంగాణ ఏర్పడిన తర్వాత పర్యాటకరంగానికి సీఎం కేసీఆర్ జవజీవాలు పోస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఆయనే స్వయంగా దక్షిణ కశ్మీర్‌గా అభివర్ణించారు. దీన్ని పర్యాటకుల ధామంగా మారుస్తామన్నారు. అనంతరం పర్యాటక శాఖాధికారులు జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా సోన్ పాతబ్రిడ్జి అనుకూలంగా ఉండటంతో ఇక్కడ బంగిజంప్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.  
 
 చెక్కుచెదరని రాతికట్టడం..
ఆదిలాబాద్‌జిల్లాకు ముఖద్వారంగా నిర్మల్ మండలంలోని సోన్ గ్రామం ఉంటుంది. ఈ గ్రామ సమీపంలోనే గోదావరినదిపై నిజాం కాలంలో పూర్తిగా నల్లరాయి, డంగుసున్నంతో బ్రిడ్జి నిర్మించారు. అప్పట్లో పటిష్టంగా నిర్మించిన ఈ బ్రిడ్జి ఏళ్లపాటు సేవలందించింది. దాదాపు కిలోమీటర్ పొడవుగల ఈ రాతికట్టడం దశాబ్దా లు గడిచినా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. తొమ్మిదేళ్ల క్రితం జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా పాతబ్రిడ్జి పక్కనే విస్తారంగా రెండు కొత్త బ్రిడ్జిలను నిర్మించారు. దీంతో పాతబ్రిడ్జిని ప్రస్తుతం ఉపయోగించడం లేదు.
 
పర్యాటకంగా అనుకూలం..
ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాలను విడదీసే గోదావరిపై గల సోన్ బ్రిడ్జి కట్టడమే చూపరులను ఆకట్టుకుంటుంది. ఇక ఇక్కడి వాతావరణం, అనుకూలతలు పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరొందిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఈ బ్రిడ్జిపై నుంచి స్పష్టంగా చూడొచ్చు. ప్రాజెక్టు గల పోచంపాడ్ కూడా ఇక్కడి నుంచి కేవలం 5కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక కొయ్యబొమ్మలకు, కోటబురుజులకు ఖ్యాతి గాంచిన నిర్మల్ పట్టణం ఇక్కడి నుంచి 12కిలోమీటర్ల దూరమే. సోన్ బ్రిడ్జికి ఇరువైపులా పచ్చని చెట్లు, మధ్యలో గోదావరి నది ఉంది. వేసవిలో రాళ్లు, చెట్లు, అక్కడక్కడ నీటిగుంటలతో ఉండే గోదావరి.. ఈ సీజన్‌లో మాత్రం నీటి పరవళ్లతో కళకళలాడుతుంది. గోదావరి మహాపుష్కరాల సందర్భంగా బ్రిడ్జికి ఇరువైపులా పుష్కరఘాట్లను అభివృద్ధి పరిచారు. సాధారణంగానే వారంలో నాలుగైదు రోజులు ఈ ఘాట్లు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఇక బ్రిడ్జి పక్కనే ఉన్న సోన్ గ్రామం కూడా చారిత్రకంగా పేరొందినదే. ఇక్కడి పురాతన ఆలయాలు, చారిత్రక ఆనవాళ్లు ఆకట్టుకుంటాయి. సమీపంలోనే అభివృద్ధికి నోచుకోని సోన్‌గఢ్ గంభీరంగా కనిపిస్తుంటుంది. 
 
 పరిశీలించిన పర్యాటక అధికారులు..
తెలంగాణ ఏర్పడిన తర్వాత పర్యాటకంగా జిల్లాను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పే ర్కొన్నారు. ఈమేరకు పర్యాటక శా ఖాధికారులు జిల్లాను సందర్శించా రు. పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ప్రదేశాలను గుర్తించారు. ఇప్పటికే నిర్మల్‌లోని శ్యాంగఢ్‌లో కోట మరమ్మతులు, పర్యాటకాభివృద్ధి పనులు చేపట్టారు. గత కొంతకాలంగా ఈ పనులు కూడా ని లిచిపోవడం గమనార్హం. ఇక గోదావరిపై వృ థాగా ఉంటున్న చారిత్రక కట్టడమైన సోన్ బ్రిడ్జి ని పర్యాటకకేంద్రంగా మారుస్తామని, ఇక్కడ బంగిజంప్‌కు ఏర్పాట్లు చేస్తామని దాదాపు ఆరునెలల క్రితం పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. బంగిజంప్‌కు కావల్సిన అనువైన వాతావరణం, ఏర్పాట్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు చర్యలు చేపడతామని కూడా చెప్పారు. కానీ.. నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎలాంటి చర్యలు ప్రారంభం కాలేదు. మరోవైపు అధికారుల ప్రకటనతో హర్షం వ్యక్తంచేసిన పర్యాటకులు.. ‘బంగిజంప్ చేసేదింకెప్పుడూ..’ అని ఎదురుచూస్తున్నారు.  
 
విదేశాల్లో క్రేజ్..
బంగిజంప్.. ఇది మాటల్లో చెప్పలేని ఓ రోమాంచితమైన అనుభూతినిచ్చే.. వీరోచితమైన సాహసం. అసలు బంగిజంప్ అంటే.. ఎత్తై కొండ ప్రాంతం నుంచి కాళ్లకు తాడు కట్టుకుని ఒక్కసారిగా లోయలోకి దూకేయడం. ఇలా గా ల్లో దూకిన తర్వాత నిర్ణీత దూరం వరకు వెళ్లిన తర్వాత మళ్లీ తాడు మనల్ని ఎక్కడినుంచైతే దూ కామో.. అక్కడికి చేరుస్తుంది. ఇలాంటి బంగి జంప్‌లు చేసేందుకు మనదేశంలో ఉత్తర భారతదేశంలో కొన్నిచోట్ల ఉన్నాయి. విదేశాల్లో మా త్రం బంగిజంప్‌కు విపరీతమైన క్రేజ్ ఉంటుం ది. మనవాళ్లు విదేశాలకు వెళ్లినప్పుడు ఇలాంటి ఫీట్లు చేస్తుంటారు. మన దగ్గర ఎప్పుడు ఏర్పాటు చేస్తారా అని ఎదురు చూస్తున్నారు.
 
 కేంద్రం అనుమతి కోసం..
ఓ రకంగా ప్రమాదకరమైన బంగిజంప్‌ను ఏర్పాటు చేయాలంటే కేంద్రప్రభుత్వం అనుమతి కావాలని పర్యాటక శాఖాధికారులు పేర్కొంటున్నారు. ఈమేరకు పర్యాటకశాఖ కార్యదర్శి బు ర్రా వెంకటేశం కేంద్రానికి అనుమతి కోసం పం పారని ఆ శాఖాధికారులు పేర్కొంటున్నారు. ఆయన ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక అభివృద్ధి, బంగిజంప్‌లపై దృష్టిపెట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement