జిల్లాలో పనిచేసిన ప్రతి అధికారి ఆదర్శప్రాయుడే
► కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్
కడప అర్బన్ : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎర్రచందనం అక్రమ రవాణా నివారణ కోసం, రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్ లాంటి కార్యక్రమాలు రాష్ట్రంలోనే ప్రథమ స్థాయిలో నిలిచేలా జిల్లా పోలీసు అధికారులు కృషి చేశారని కడప, కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ ప్రశంసించారు. జిల్లా ఎస్పీగా పనిచేస్తూ నెల్లూరుజిల్లాకు బదిలీపై వెళుతున్న పీహెచ్‌డీ రామకృష్ణ, జిల్లా అదనపు ఎస్పీగా పనిచేస్తూ ప్రకాశం జిల్లా ఎస్పీగా పదోన్నతిపై వెళుతున్న బి.సత్య ఏసుబాబు, పులివెందుల ఏఎస్పీగా పనిచేస్తూ తూర్పుగోదావరి జిల్లా ఓఎస్డీగా వెళుతున్న అన్బురాజన్, జిల్లాలో ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న గౌతమిసాలీలకు ఆదివారం కడప నగర శివార్లలోని మేడా కన్వెక్షన్ హాలులో వీడ్కోలు, సన్మాన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఐజీతోపాటు అధికారులకు పోలీసులు స్వాగతం పలికారు.
అనంతరం డీఐజీ మాట్లాడుతూ అంకితభావంతో ఎస్పీ రామకృష్ణ, మిగతా అధికారులు పనిచేసి జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచేలా చేశారన్నారు. జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు అగ్రహారం శ్రీనివాసశర్మ మాట్లాడుతూ జిల్లా పోలీసు యంత్రాం గానికి ఎస్పీ రామకృష్ణ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారన్నారు. జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో పోలీసు యంత్రాంగం, ప్రజలు, మీడియా తన విధులను చట్టపరంగా నిర్వర్తించేందుకు ఎంతో సహకరించారన్నారు. అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) సత్య ఏసుబాబు మాట్లాడుతూ జిల్లా పోలీసు యంత్రాంగం శాంతిభద్రతల పరిరక్షణలో తన వెన్నంటి ఉన్నారన్నారు. పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ పోలీసు అధికారుల సహకారంతో అనేక టాస్క్‌లను పూర్తి చేయగలిగామన్నారు. డీటీసీ బసిరెడ్డి మాట్లాడారు. అనంతరం అధికారులను సన్మానించారు. ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ బి.శ్రీనివాసులు, ఎస్‌బీ డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, రాజంపేట డీఎస్పీ రాజేంద్ర, మైదుకూరు డీఎస్పీ బీఆర్ శ్రీనివాసులు, షౌకత్ అలీ, సుధాకర్, ట్రాఫిక్ డీఎస్పీ భక్తవత్సలం, మహిళా అప్‌గ్రేడ్ డీఎస్పీ వాసుదేవన్, డీసీఆర్‌బీ డీఎస్పీ నాగేంద్రుడు, ఏఆర్ డీఎస్పీ మురళీధర్, సీఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.