రెండు గంటల్లోనే పాలేరు భవితవ్యం!
ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక కౌంటింగ్ గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన రెండు గంటల్లోనే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ ఉప ఎన్నికలో మొత్తం 13మంది అభ్యర్థులు బరిలో నిలవగా, ప్రధానంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితారెడ్డి, సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్ మధ్య పోటీ నెలకొంది.
ఓట్ల లెక్కింపు కోసం ఈవీఎంలను భారీ బందోబస్తు మధ్య ఖమ్మం నగరంలోని పత్తి మార్కెట్‌కు తరలించారు. ఈ మార్కెట్ యార్డులోనే ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 243 పోలింగ్ కేంద్రాల్లో 243 ఈవీఎంలను 14 టేబుళ్లపై ఉంచి 18 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఇందుకు తగిన యంత్రాంగాన్ని నియమించారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేస్తారు. పత్తి మార్కెట్‌యార్డు ప్రాంగణమంతా కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.