పదేళ్ల ప్రయాణం ఉల్లాసంగా సాగింది
అనంతపురం సప్తగిరిసర్కిల్ : ఆర్డీటీ ఆధ్వర్యంలో పదేళ్లుగా నిర్వహిస్తున్న ఫుట్‌బాల్ కోచింగ్ క్యాంపు ప్రయాణం ఉల్లాసంగా సాగుతోందని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం అనంత క్రీడా గ్రామంలో సెయింట్ విన్సెంట్ ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన స్పెయిన్ బృందం వేసవి ఫుట్‌బాల్ శిక్షణ శిబిరాన్ని ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు జిల్లాలో 1600 మంది క్రీడాకారులు ఫుట్‌బాల్ ఆడుతున్నారంటే దానికి కారణం ఆనాడు సెయింట్ విన్సెంట్ ఫుట్‌బాల్ క్లబ్ వారు చేసిన కృషి వల్లనే సాధ్యపడిందన్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా 24 మంది సభ్యులతో కూడిన బృందం పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ బృందం జిల్లాలోని అన్ని కేంద్రాల్లోనూ ఈ నెల 2 నుంచి 10 వరకు శిక్షణ అందించి క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీస్తుందన్నారు. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ పదేళ్ల ప్రయాణం సందర్భంగా కేక్‌ను కట్ చేసి, బ్రోచర్ విడుదల చేశారు. కార్యక్రమంలో స్పెయిన్ మేయర్ మైఖెల్, క్లబ్ వైస్ చైర్మన్ పటావు, స్పెయిన్ బృందం సభ్యుడు పెరీఫెర్రర్, ఆర్డీటీ డైరెక్టర్లు నిర్మల్‌కుమార్, దశరథరామయ్య, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, కార్యదర్శి నాగరాజు, ఆర్డీటీ వైద్యుడు సయ్యద్ హుస్సేన్, శాప్ ఫుట్‌బాల్ కోచ్ జాకీర్, అకాడమీ కోచ్‌లు దాదాఖలందర్, రియాజ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.