ఇస్కా.. చూడిక
రేపటి నుంచి తిరుపతిలో సైన్స్‌కాంగ్రెస్ సదస్సు
హాజరుకానున్న ప్రధానమంత్రి
సదస్సులో పాల్గొననున్న ఆరుగురు నోబెల్ గ్రహీతలు
ఎస్వీ యూనివర్సిటీలో ఏర్పాట్లు పూర్తి
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మరో 24 గంటల్లో మొదలుకాబోతుంది. గత రెండు నెలలుగా తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు రూ.175కోట్ల ఖర్చుతో తిరుపతి నగరాన్ని అందంగా ముస్తాబుచేశారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును 3వ తేదీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎస్వీయూ స్టేడియంలో ఏర్పాటుచేసిన సభలో ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వివిధ దేశాలకు చెందిన ఆరుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు హాజరుకానున్నారు. ఈ సదస్సులో ప్రధాని తన సందేశం ఇవ్వడంతో పాటు నోబెల్ గ్రహీతలతో ముఖాముఖిలో పాల్గొంటారు.
యూనివర్సిటీక్యాపంస్: ‘సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ నేషనల్ డెవలప్‌మెంట్’ అనే అంశంపై జరుగుతున్న 104వ సైన్స్ కాంగ్రెస్‌కు 10,500 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వివిధ దేశాల నుంచి 200 మంది శాస్త్రవేత్తలు హాజరవుతారు. ఈ సందర్భంగా దాదాపు 10 మందికి ప్రధాని వివిధ రకాల అవార్డులను అందజేస్తారు. 3వ తేదీ మధ్యాహ్నం నుంచి శ్రీనివాస ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో నోబెల్ గ్రహీతలు తమ సందేశాలను ఇవ్వనున్నారు. 4 నుంచి 7వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 5 వేదికల్లో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా బ్లూ ఎకానమీ, ఫుడ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, నెట్ జనరేషన్ నెట్‌వర్క్, క్లైమేట్ చేంజ్, లీడర్‌షిప్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పాంట్రియర్స్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్, స్పేస్ టెక్నాలజీ, 5జీ అండ్ ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్, ఆఫ్‌సోర్ విండ్ ఫామ్స్, నానో టెక్నాలజీ, తదితర అంశాలపై 32 ప్లీనరీ ల్లో నిర్వహిస్తారు. వీటిల్లో ఎంఎస్ స్వామినాథన్, సతీష్‌రెడ్డి, ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్, తదితర ప్రముఖులు తమ సందేశాలను, అభిప్రాయాలను అందిస్తారు. మధ్యాహ్నం నుంచి 34 వేదికల్లో టెక్నికల్ సెషన్స్ జరుగుతాయి. వీటిల్లో పరిశోధకులు తమ పరిశోధన పత్రాలు సమర్పిస్తారు.
4 నుంచి చిల్డ్రన్ కాంగ్రెస్
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా 4 తేదీ నుంచి 6వ తేదీ వరకు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లో చిల్డ్రన్ కాంగ్రెస్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్, భారత ప్రభుత్వ సాంకేతిక సలహాదారు చిదంబరం, రక్షణశాఖ సలహాదారు సతీష్‌రెడ్డి ఈ సమావేశంలో ప్రసంగిస్తారు. ఇందులో భాగంగా ఉదయం పూట ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిపుణులు ఉపన్యా సం ఇస్తారు. మధ్యాహ్నం నుంచి బాలలను ఉత్తేజపరిచే సైన్స్ సినిమాలు, డాక్యుమెంటరీలు ప్రదర్శిస్తారు. 1,200 మంది పిల్లలు హాజరుకానున్నారు.
4న ఉమెన్ కాంగ్రెస్
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా 4వ తేదీన శ్రీనివాస ఆడిటోరియంలో ఉమెన్ కాంగ్రెస్ సమావేశం నిర్వహిస్తారు. ఈ సదస్సును సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. 10మంది మహిళా శాస్త్రవేత్తలు ప్రసంగించి మహిళలను ఉత్తేజపరుస్తారు.
12 వేల మందికి ఏర్పాట్లు
ప్రధాని ప్రారంభించే సమావేశంలో 12వేల మంది కూర్చునేవిధంగా స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. వీఐపీలు, వీవీఐపీలు, అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులకు వేర్వేరుగా సీట్లు కేటాయించారు. ఈ సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు 10 ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. ఏ బ్లాక్ వద్ద వంటచేసి అన్ని ఫుడ్ కోర్టులకు పంపిణీ చేస్తారు.