పైరు దెబ్బతిన్నా పట్టించుకోవట్లేదు..
* పరిహారంపై స్పష్టత లేదు
* గడప గడపకు వైఎస్సార్‌లో ముంపు బాధితుల గగ్గోలు
సాక్షి, గుంటూరు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని, నష్టపరిహారం విషయంలో స్పష్టత లేకుండా పోయిందని యడ్లపాడు మండలం సందెపూడి గ్రామానికి చెందిన రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మర్రి నష్టపరిహారం అందించకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తే వైఎస్సార్‌సీపీ అండగా ఉండి పోరాడుతుందని హామీ ఇచ్చారు. జిల్లాలో శనివారం చిలకలూరిపేట, గురజాల, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను నేతల ఎదుట మొర పెట్టుకున్నారు.
నిత్యావసరాలూ పంపిణీ చేయలేదు...
వరదల వల్ల తీవ్రంగా నష్టపోయామని, కనీసం బియ్యం, నిత్యావసర వస్తువులు కూడా ప్రభుత్వం పంపిణీ చేయలేదని దాచేపల్లి మండలం శంకరాపురం గ్రామానికి చెందిన భూక్యా నరసింహ నాయక్ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన జంగా.. పంటలు దెబ్బతిని, ఇళ్లలోకి నీరు చేరి నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ అండగా ఉండి పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు.
కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్నారు...
మరుగుదొడ్లు నిర్మించుకుంటే బిల్లులు ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్నారని బొల్లాపల్లి మండలం పలుకూరు గ్రామానికి చెందిన చంద్రమ్మ అనే మహిళ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు ఎదుట వాపోయారు. రేషన్ కార్డులో తండ్రి పేరు లేకపోవడంతో దాన్ని చేర్చాలంటూ కార్యాలయం చుట్టూ రెండు నెలలుగా తిరుగుతున్నామని, అయినా అధికారులు స్పందించడం లేదని, అది లేకపోతే స్కాలర్‌షిప్పు పోయే ప్రమాదం ఉందని గ్రామానికి చెందిన బంకా దేవి అనే విద్యార్థిని బ్రహ్మనాయుడు ఎదుట వాపోయింది. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానంటూ బ్రహ్మనాయుడు వారికి హామీ ఇచ్చారు.