వేరుశనగ రైతులకు అన్యాయం
► అధికారుల నిలదీత
► పోలీసుల సమక్షంలోబాండ్ల పంపిణీ
తొండూరు : ఖరీఫ్ 2016లో వేరుశనగ పంట సాగు చేసి నష్టపోయిన వారికి ఇన్‌పుట్ సబ్సిడీలో అవకతవకలు జరిగాయని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఇనగలూరు గ్రామంలో సర్పంచ్ సావిత్రమ్మ అధ్యక్షతన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ బాండ్ల పంపిణీ కార్యక్రమం ఏఓ కిశోర్ నాయక్ ప్రారంభించారు. పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు కాకుండా.. పంట సాగు చేయని వారికి ఎలా వచ్చిందంటూ వ్యవసాయాధికారులను అన్నదాతలు నిలదీశారు. వేరుశనగ సాగు చేసిన వారి పేర్లను ఎంపీఈఓ శివ చదివి వినిపించారు.సాగుచేయని వారి పేర్లు జాబితాలో ఎలా వచ్చాయంటూ అధికారులను నిలదీశారు.అర్హులైన వారికి బాండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చక్రం తిప్పిన గ్రామ నౌకర్లు: ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరులో గ్రామ నౌకర్లు చక్రం తిప్పినట్లు రైతులు చెబుతున్నారు. గ్రామ నౌకర్లు, ఎంపీఈఓలు ఫీల్డ్ విజిట్‌కు వెళ్లినప్పుడు రైతుల వద్ద డబ్బులు తీసుకుని పంట సాగు చేయని వారి పేర్లను జాబితాలో పొందుపరిచారని ఆరోపించారు. గ్రామంలో ఓ రైతు అర ఎకరాలో వేరుశనగ సాగు చేస్తే రూ.13వేలు,మరొకరికి ఎకరాకు రూ.26వేలు మంజూరైందని.. అర్హులైన మేం ఐదెకరాల్లో సాగు చేస్తే కేవలం రూ.6వేలు మాత్రమే వచ్చిందని గ్రామానికి చెందిన బాల ఎరికల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి అంకిరెడ్డి, అరుణమ్మ, వీరనారాయణరెడ్డి తెలిపారు. ఎంపీఈఓలు, జియో ట్యాగింగ్ చేసే సమయంలో గ్రామ నౌకర్లు కొంతమంది చక్రం తిప్పారని అన్నదాతలు ఆరోపించారు. కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.
దీంతో ఏఓ కిశోర్ నాయక్ తొండూరు ఎస్‌ఐ శ్రీనివాసులుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్‌ఐ వెంటనే ఏఎస్‌ఐ రమణ, పోలీసు సిబ్బందిని ఇనగలూరు గ్రామానికి పంపించారు. పోలీసుల సమక్షంలో బాండ్లు పంపిణీ చేశారు. ఈ విషయమై ఏఓ కిశోర్‌నాయక్‌ను సాక్షి వివరణ కోరగా ఫీల్డ్ విజిట్‌లో రెవెన్యూ అధికారులు పొరపాటు చేయడంవల్ల ఇలా జరిగిందని.. రెండు రోజుల్లో రెవెన్యూ అధికారులతో చర్చించి రైతులందరికీ ఇన్‌పుట్ సబ్సిడీ అందేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ తాలుకా కార్యదర్శి దశరథరామిరెడ్డి, మాజీ సర్పంచ్ గంగయ్య, ఎంపీఈఓలు తదితరులు పాల్గొన్నారు.