నేనే లోకల్
నెల్లూరు సిటీ: నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీలో త్రిముఖపోటీ నెలకొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న సంస్థాగత ఎన్నికలకు ముగ్గురు నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తనకు మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇస్తారని ఆశిస్తుండగా, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా ఎమ్మెల్సీ బరిలో దిగేందుకు పార్టీ ముఖ్యనేతలతో చర్చించారు. అయితే ఇపుడు అనూహ్యంగా ఆనం రామనారాయణరెడ్డి పేరు తెరపైకి వచ్చింది.
పార్టీలో మరింత పట్టు కోసమే
ఇటీవల కాంగ్రెస్‌పార్టీ నుంచి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న ఆనం సోదరులు పార్టీలో తమకు ప్రాధాన్యత పెంచుకునేందుకు తగిన పదవి కోసం వేచిచూశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మకూరు నియోజవర్గ ఇన్‌చార్జిగా చంద్రబాబునాయుడు అవకాశం కల్పించారు. దీంతో ఇప్పటికే ఆ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు కొందరు అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందుగా ఆనం వివేకానందరెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే తెలుగుదేశంలోని ఓ వర్గం ఆనం వివేకాందరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే సహించేది లేదని పార్టీ అధిష్టానానికి తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఆనం వివేకాందరెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి రేసులో నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. కానీ తన బదులు ఆనం రామనారాయణరెడ్డికి అవకాశం కల్పించాలంటూ సోదరుడితో కలిసి ప్రయత్నించారు.
ఆనం సోదరులు సోమవారం విజయవాడలో మంత్రి నారాయణను కలిసి గంటపాటు చర్చించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామనారాయణరెడ్డి పేరును ఖరారు చేయాలని కోరినట్లు తెలుస్తుంది. ఆయన కూడా సముఖత వ్యక్తం చేశారని.. మంత్రి పదవులు నిర్వహించిన అనుభవం, పార్టీని బలోపేతం చేస్తారన నమ్మకంతో ఆనం రామనారాయణరెడ్డికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చే దిశగా అధిష్టానం సైతం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే వాకాటి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం తమకే దక్కించుకోవాలని ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.