మీ బిల్లు మరికొంత కాలం సజీవం
కేవీపీ, వెంకయ్యల మధ్య ఆసక్తికర సంభాషణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంపై డిమాండ్‌లు ప్రతిధ్వనిస్తున్న నేపథ్యంలో బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో సవరణలను ప్రతిపాదిస్తూ రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును కేవీపీ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లుపై గత శుక్రవారం చర్చ జరిగింది. ఈ నెల 13న మరోదఫా బిల్లు చర్చకు రానుంది. అయితే వివిధ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నందున పార్లమెంట్ సమావేశాలను ముందుగా ముగించాలనే ప్రతిపాదన వచ్చింది.
దీంతో 13వ తేదీ వరకూ సమావేశాలు కొనసాగుతాయా అని వెంకయ్యనాయుడు వద్ద కేవీపీ వాకబు చేశారు. దీనికి స్పందించిన వెంకయ్య.. సమావేశాల వాయిదాపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మీ బిల్లు మరికొంత కాలం సజీవంగా ఉండే అవకాశాలు ఉన్నాయని జవాబిచ్చారు. ‘ ఏపీకి ప్రత్యేక హోదాపై అధికారంలో ఉన్నప్పుడు కేవీపీకి విల్ లేదని, ఇప్పుడు ప్రతిపక్షంలో బిల్ ప్రవేశ పెట్టారని’ వెంకయ్యనాయుడు తన సహజ ధోరణిలో వ్యాఖ్యానించారు.