జానపద గాయకుడు గణేశ్‌చారి కన్నుమూత | Janapadha singer Ganeshchary passes away | Sakshi
Sakshi News home page

జానపద గాయకుడు గణేశ్‌చారి కన్నుమూత

Published Fri, Jul 10 2015 12:12 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

జానపద గాయకుడు గణేశ్‌చారి కన్నుమూత

జానపద గాయకుడు గణేశ్‌చారి కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖ జానపద గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు నీలం గణేశ్‌చారి(68) అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న ఆయన విద్యానగర్‌లోని తన నివాసంలో గురువారం తుదిశ్వాస విడిచారు. ‘చుట్టూ చుక్కలు చూడు.. నడుమ చంద్రున్ని చూడు.., కోడిపాయే లచ్చమ్మది.. కోడి పుంజుపాయే లచ్చమ్మది, రావు రావు సమ్మక్క.. రావే నా తల్లి సమ్మక్క.., జిల్లేలమ్మ జిట్టా’ వంటి ప్రఖ్యాతిగాంచిన జానపద గీతాలను గణేశ్‌చారి ఆలపించారు. ఆకాశవాణి, దూరదర్శన్‌ల్లో తెలంగాణ జానపదాన్ని వినిపించిన మొట్టమొదటి గాయకుడు ఆయనే. యాకత్‌పుర బ్రాహ్మణ వాడి నీలం నర్సింహ, బాలమ్మలకు గణేశ్‌చారి జన్మించారు. 1966లో ఆయన జానపదాలు పాడటం ప్రారంభించారు.

అప్పటి నుంచి లాల్‌దర్వాజ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరల్లో జానపద గీతాలు ఆలపించేవారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆయన హెచ్‌ఎంటీ బేరింగ్స్‌లో ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. ఆ సమయంలో జరిగిన పోలీసు కాల్పుల్లో గణేశ్‌చారి గాయపడ్డారు. ఆయనకు భార్య సుజాత, నలుగురు కుమారులు ఉన్నారు. కాగా, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు గణేశ్‌చారి భౌతికకాయానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Advertisement
Advertisement