పోటీతత్వంతో ముందుకెళ్లాలి
-
జేసీ ఇంతియాజ్
గూడూరు:
నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పోటీతత్వంతో ముందుకెళ్లాలని జేసీ ఇంతియాజ్ అన్నారు. గూడూరు రూరల్ పరిధిలోని సచిన్ దత్తత గ్రామమైన పుట్టంరాజువాని కండ్రిగలో ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ మిషన్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో మంగళవారం జాబ్ మేళా జరిగింది. కార్యక్రమానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ ఎక్కడికెళ్లినా, ఏం చేస్తున్నా పోటీ అనేది తప్పడం లేదన్నారు. ఉద్యోగం సాధించడానికి పోటీ తప్పదనుకుంటే అది సాధించాక కూడా విధి నిర్వహణలో కూడా ఆ పోటీ తప్పడం లేదన్నారు. సచిన్ దత్తత గ్రామంలో ఎన్నో అభివృద్ది పనులు జరిగాయని, గ్రామాభివృద్దే కాకుండా ఆ గ్రామంలో జీవనం సాగించే ప్రతి ఒక్కరికీ జీవనోపాధి కల్పించడం కూడా చేయాల్సి ఉందన్నారు. ఈ మేరకు కృష్ణపట్నం పోర్టు, హిందూస్థాన్, గమీషా, మీనాక్షి, సింహపురి, శ్రీసిటి లాంటి 38 కంపెనీలకు చెందిన ప్రతినిధులచే ఈ జాబ్ మేళా నిర్వహించి పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ఇన్‌చార్జి ఆర్డీఓ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ జిల్లాలోని నలు మూలల నుంచి సుమారు 1500 మందికి పైగా నిరుద్యోగ యువతీయువకులు ఈ జాబ్ మేళాకు వచ్చారని తెలిపారు. డీఆర్‌డీ ఏపీడీ లావణ్యవేణి, సర్పంచ్ నాగేశ్వరరావు, జెడ్పీటీసీ బొమ్మిరెడ్డి పద్మ, ఎంపీటీసీ పెంచలరావు, తహసీల్దార్ భవానీ, హౌసింగ్ డీఈ నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.