గ్రహణం వేళ కోవెలల మూసివేత
-నేటి ఉదయం సంప్రోక్షణానంతరం పునర్దర్శనాలు
రామచంద్రపురం రూరల్ : చంద్రగ్రహణంతో సోమవారం జిల్లాలోని ఆలయాలను మూసివేశారు. ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో ఉదయం 5.30 నుంచి 11 గంటల వరకు అభిషేకాలు, పూజలు జరిపించారు. మధ్యాహ్నం 12.30 గంటల ఆలయాన్ని మూసివేశారు. తిరిగి మంగళవారం ఉదయం 8.30 గంటలకు పునర్దర్శనం కల్పించనున్నట్లు ఈఓ పెండ్యాల వెంకట చలపతిరావు తెలిపారు.
అప్పనపల్లిలో..
మామిడికుదురు (పి.గన్నవరం): చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీబాలబాలాజీ స్వామి ఆలయాన్ని సోమవారం ఉదయం 11 గంటలకు మూసివేశారు. స్వామి వారికి ప్రధానార్చకులు మద్దాలి తిరుమలశింగరాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు చెల్లించి ఆలయాన్ని మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి స్వామి వారి దర్శనాన్ని పునరుద్ధరిస్తామని ఈఓ పొలమూరి బాబూరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్ తెలిపారు.
తలుపులమ్మ లోవలో..
తుని రూరల్ : లోవ దేవస్థానంలో సోమవారం శ్రావణమాసం, పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తలుపులమ్మవారికి ప్రీతికరమైన చండీహోమాన్ని వేదపండితులు ముష్టి వెంకట పురుషోత్తమశర్మ, రాణి సుబ్రహ్మణ్య శర్మ, శశాంక్ త్రిపాఠి నిర్వహించారు. అసిస్టెంట్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్, చైర్మన్ కరపా అప్పారావు, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. చంద్రగ్రహణం సందర్భంగా హోమం అనంతరం ప్రత్యేక పూజలు చేశాక ఉదయం 11.15 గంటలకు ఆలయం తలుపులను మూసివేశారు. జాతీయ రహదారివద్ద ఉన్న నమూనా ఆలయాన్ని కూడా మూసివేసినట్టు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం ఉదయం 8.45 గంటలకు భక్తులకు దర్శనాలు కల్పిస్తామన్నారు.
అయినవిల్లిలో..
అయినవిల్లి (పి.గన్నవరం) :
చంద్రగ్రహణం సందర్భంగా అయినవిల్లి విఘ్నేశ్వరాలయాన్ని సోమవారం ఉదయం 11 గంటల నుంచి మూసివేశారు. మంగళవారం తెల్లవారు జామున ఆలయ ప్రధానార్చకులు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి సంప్రోక్షణ పూజలు చేసి ఆలయాన్ని తెరుస్తారని, ఉదయం 6 గంటల నుంచి స్వామికి యథావి«ధిగా పూజలు నిర్వహిస్తామని ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు.