బన్నీ ఉత్సవంలో రక్తపాతం వద్దు..
కర్నూలు(అగ్రికల్చర్): తమిళనాడులో జల్లికట్టు తరహాలో ఏపీలోని కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రలతో కొట్టుకుంటూ నిర్వహించే బన్నీ ఉత్సవాలపై అధికారు కీలక ఆదేశాలను వెలువరించారు. దేవరగట్టు మాలమల్లేశ్వరస్వామి బన్నీ ఉత్సవాల్లో ఎలాంటి రక్తపాతానికి తావులేకుండా శాంతి యుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్.. నెరణికి గ్రామస్థులు, దేవస్ధానం అధికారులను కోరారు. కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో బుధవారం దేవరగట్టు బన్ని ఉత్సవాలపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్.. బన్ని వేడుకల్లో రింగులు తొడిగిన కర్రలు వాడొద్దని సూచించారు. ఈమేరకు భక్తులను చైతన్యపరిచేలా కళాజాతలలో ప్రచారం చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.
ఉత్సవం నిర్వహించే రోజు మద్యం, నాటు సారా అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. దేవరగట్టు చుట్టుపక్కల గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా అధికారులు, గ్రామస్తులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కషి చేయాలన్నారు. సమీక్షకు హాజరైన జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ... బన్నీ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ తగిన చర్యలు తీసుకుంటున్నదని, గత ఏడాది పోలీసులు, గ్రామస్తులు సమన్వయంతో పనిచేయడం వల్ల ఎవ్వరికి గాయలు లేకుండా బన్ని ఉత్సవం ముగిసిందనానరు. ఈ సారి కూడా గ్రామస్థులు, దేవాలయం అధికారులు సహకరించాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, కర్నూలు ఆర్‌డీఓ రఘుబాబు, వివిధ శాఖల అధికారులు, నెరణికి గ్రామ నేతలు గాదేగౌడు, రామలింగంగౌడు, శేకన్న న్యాయవాది మల్లికార్జునగౌడు, దేవాలయ చైర్మన్ కుమారగౌడు తదితరులు పాల్గొన్నారు.