మీరు పాతనోట్లివ్వండి...
మీరు పాతనోట్లివ్వండి...
Published Mon, Dec 5 2016 10:54 PM | Last Updated on Tue, Oct 16 2018 2:30 PM
= జిల్లాలో జోరుగా నంబర్‌గేమ్
= పాతనోట్లతో ఆకర్షిస్తున్న మట్కా బీటర్లు
= నంబర్ తగిలితే కొత్తనోట్లు ఇస్తామని వల
= అనంతపురం రెండు రోజుల్లో రూ.కోటికి పైగా లావాదేవీలు
= అన్నీతెలిసీ కళ్లుమూసుకున్న పోలీసులు
మీరు పాతనోట్లివ్వండి...మేము కొత్తనోట్లిస్తా మంటున్నారు మట్కానిర్వాహకులు...దీంతో జనం నంబర్‌గేమ్ ఆడేందుకు ఎగబడుతున్నారు. 9.15 గంటలకోసారి...11.15 గంటలకోసారి తమ అదృష్టాన్ని తెలుసుకుంటున్నారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో మట్కా ఆడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. అందువల్లే రెండు రోజుల్లోనే కేవలం అనంతపురం నగర పరిధిలోనే కోట్లలో మట్కా లావాదేవీలు నడిచినట్లు తెలుస్తోంది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం
పెట్రోలు బంకులు, ఆస్పత్రులు, రైల్వేస్టేషన్లతో సహా ఎక్కడా పాతనోట్లు చెల్లుబాటు కాదని ఆర్‌బీఐ తేల్చేసింది. పాతనోట్లు ఉన్నవారు బ్యాంకుల్లో జమ చేయడం మినహా మరోదారి లేదని వెల్లడించింది. కానీ జిల్లాలోని మట్కా నిర్వాహకులు మాత్రం పాతనోట్లు స్వీకరిస్తున్నారు. మట్కా నంబర్ తగిలితే కొత్తనోట్లు ఇస్తామని చెబుతున్నారు. దీంతో గతంలో ఎప్పుడూ లేనివిధంగా మట్కావ్యాపారం జోరుగా నడుస్తోంది. గురు, శుక్ర రెండురోజుల్లో అనంతపురం నగర పరిధిలోనే రూ.కోటికిపైగా మట్కా లావాదేవీలు నడిచాయంటే.. జిల్లా వ్యాప్తంగా మట్కా ఏ స్థాయిలో నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు.
ఇదీ మట్కా నడుస్తోన్న తీరు
అనంతపురం, తాడిపత్రి, కదిరి, గుంతకల్లు, ధర్మవరం, హిందూపురంలో భారీగా మట్కా నడుస్తోంది. గతంలో రతన్‌లాల్ మట్కా వారానికి ఐదురోజులు జరిగేది. ఇప్పుడు కళ్యాణ్, సత్తా మట్కాలు ఆరు రోజులు జరుగుతున్నారుు. ఈ మాట్కాకు నంబర్లు గుజరాత్, ముంబయి నుంచి వస్తాయి. ఇవి కాకుండా ‘అనంత’లోని కొందరు ప్రైవేటు వ్యక్తులు కూడా మట్కా నిర్వహిస్తున్నారు. ఈ మట్కా ఆదివారం కూడా నడుస్తోంది. కళ్యాణ్, సత్తా మట్కాలు సాయంత్రం 5 గంటల వరకు చీటీలకు డబ్బులు తీసుకుంటారు. రాత్రి 9.15కు ‘ఓపెన్’, రాత్రి 11.15కు ‘క్లోజ్’ నంబరు ప్రకటిస్తారు. ఆ వెంటనే బ్రాకెట్ నంబరు రిలీజ్ చేస్తారు. దీంతోనే మట్కా రాయుళ్లు చాలామంది మట్కా నంబర్ రాసిన తర్వాత నంబర్ వెల్లడయ్యే వరకు టెన్షన్ తట్టుకోలేక ఫస్ట్‌షో, సెకండ్‌షో సినిమాలకు వెళుతుంటారు.
అనంతపురం వన్‌టౌన్ పరిధిలో మట్కాబీటర్లు అధికం. ఇక్కడ ఎవరు మట్కా నిర్వహిస్తారు? మట్కా బీటర్లు ఎవరనే సంగతి ఇక్కడి పోలీసులకు క్షుణ్ణంగా తెలుసు. అయినా మట్కా నిర్వహణకు బ్రేక్ వేయలేకపోతున్నారు. దీనికి కారణం మట్కాబీటర్లకు ఇక్కడి కొంతమంది పోలీసులతో ఉన్న సత్ససంబంధాలే అని తెలుస్తోంది. దీంతోపాటు టూటౌన్, త్రీటౌన్, ఫోర్త్‌టౌన్ పరిధిలో కూడా మట్కా నడుస్తోంది. ఇక్కడా అదే పరిస్థితి. తాడిపత్రి, కదిరి, హిందూపురం, గుంతకల్లు, ధర్మవరంలో కూడా జోరుగా సాగుతోంది. ఈ ఊబిలో కూరుకపోరుున వేలాది కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నారుు. మట్కా రాసే వారిలో కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారు.
పాతనోట్లతో మట్కా కొత్తపుంతలు
పాతనోట్ల స్వీకరణతో మట్కా కొత్తరూపు సంతరించుకుంటోంది. ఇప్పటి వరకూ మట్కాపై రూ.వంద రాసే వ్యక్తి పాతనోట్లతో రూ.500, వెయి రాస్తున్నాడు. ఇలా రాసే మొత్తం పెరగడంతో బీటర్ల ఆదాయం భారీగా పెరిగింది. భారీవ్యాపారాలు చేస్తూ మట్కాకు బానిసలై కొన్నేళ్లుగా చీటీలు రాస్తున్నవారివద్ద భారీగా పాతనోట్లు ఉన్నాయి. వీటిని బ్యాంకులో డిపాజిట్ చేసినా ఐటీ లెక్కల ప్రకారం భారీగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. దీంతో ఒక్కొక్కరు 5 నంబర్లపై భారీగా వెచ్చిస్తున్నారు. వీరిని చూసుకుని ఇప్పటి వరకూ మట్కా అలవాటు లేని వ్యక్తులు కూడా పాతనోట్లతో ఆట మొదలు పెడుతున్నారు. జిల్లావ్యాప్తంగా నడుస్తున్న మట్కా వ్యాపారంలో బీటర్లు కొన్ని నంబర్లకు మాత్రమే కంపెనీలకు డబ్బు చెల్లించి తక్కిన మొత్తాన్ని వీరే స్వాహా చేస్తున్నారు. ఈ డబ్బును బెంగళూరు, బళ్లారిలో మట్కా సాగిస్తోన్న వారికి సరఫరా చేసి డబ్బులు మార్చే పనిలో ఉన్నారు.
పేకాటకూ పాత నోట్లే..
మట్కాతో పాటు పేకాట కూడా జిల్లాలో జోరుగా నడుస్తోంది. పేకాటరాయుళ్లు కూడా పాతనోట్లతో ’గేమ్’ ఆడుతున్నారు. జిల్లాలో ఓ క్లబ్‌తో పాటు ఏపీబీఆర్, ఎంపీఆర్ డ్యాంల వద్ద భారీగా పేకాట ఆడుతున్నారు. కొందరు బళ్లారితో పాటు కర్ణాటక సరిహద్దు దాటి అక్కడ పేకాట ఆడుతున్నారు.
ఎస్పీ దృష్టి సారిస్తే
పాతనోట్లతో మట్కాసాగిస్తోన్న వ్యవహారం నగరంలోని ఓ సీఐ దృష్టికి వచ్చింది. అయితే బీటర్లను పిలిపించి, వారితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎస్పీ మట్కా నిర్వాహకులపై దాడులు చేస్తే భారీస్థారుులో పాతనోట్లు లభించే అవకాశం ఉంది.
Advertisement
Advertisement