టీడీపీ నేతలపై మంత్రి గంటా ఫైర్..
వైఎస్సార్ జిల్లా: కడపలో జరిగిన కాపు సంక్షేమం, అభివృద్ధి మేధోమథన సదస్సుకు హాజరయ్యేందుకు మంగళవారం కడపకు వచ్చిన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విజయవాడ నుంచి మంత్రి గంటా విమానం ద్వారా కడపకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి మంత్రి గంటాను ఆ పార్టీ నాయకుడు పుత్తా నరసింహారెడ్డి భోజనానికి నగరంలోని తన హరిప్రియ హోటల్‌కు తీసుకెళ్లారు. అప్పటివరకు విషయాన్ని గుర్తించలేకపోయిన మంత్రి ఒక్కసారిగా పరిస్థితి అర్థం చేసుకుని పుత్తాపై మండిపడినట్లు తెలిసింది.
రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అయిన తనను ఇలా ఒక ప్రైవేటు హోటల్‌కు తీసుకు రావడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒక పద్ధతి అంటూ లేకుండా ప్రొటోకాల్‌ను ఏమాత్రం పాటించకుండా తమ ఆర్భాటాల కోసం తనను వాడుకోవడం తగదని సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయమై బందోబస్తులో ఉన్న పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే కడప నగర టీడీపీ అధ్యక్షుడు హరీంద్రనాథ్‌తోపాటు మరో టీడీపీ నాయకుడు దుర్గాప్రసాద్ మంత్రి గంటా వద్దకు వెళ్లారు. పార్టీలో ఇతర వర్గాల పెత్తనం కొనసాగుతోందని, కాపు వర్గాలకు ఏమాత్రం ప్రాధాన్యత కల్పించడం లేదని ఆరోపించినట్లు సమాచారం. ఈ సందర్భంగా హరీంద్రనాథ్ మాట్లాడుతూ పార్టీకి ఎంతో సేవలు చేస్తున్న దుర్గాప్రసాద్‌కు ఏ పదవి ఇవ్వకుండా, ప్రాధాన్యత కల్పించడం లేదని తెలిపారు. అతనికి ఏదో ఒక పదవిని కట్టబెట్టాలని సిఫార్సు చేశారు. దీంతో మంత్రి గంటా వారిద్దరిపై ఫైర్ అయ్యారు. పార్టీలో ఏం జరుగుతోందో? ఎవరు ఎలా నడుచుకుంటున్నారో? నాకు అంతా తెలుసని, ఎవరూ నాకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. మంత్రి గంటా సీరియస్ అయిన అంశం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది.