అదృశ్యమైన విద్యార్థి మృతి
Published Mon, Jan 23 2017 11:54 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
ఆలూరు రూరల్/పత్తికొండ టౌన్: మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఆలూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి పత్తికొండ హంద్రీనీవా కెనాల్‌లో శవమై తేలాడు. పాములపాడు మండలం కృష్ణారావుపేటకు చెందిన మద్దిలేటి కుమారుడు మనోజ్ ఆలూరు కోయనగర్‌లో మిత్రులతో కలిసి అద్దె గదిలో ఉంటూ చదువుకుంటున్నాడు. మూడు రోజుల క్రితం సొంతరులో పని ఉందని మిత్రులకు చెప్పి బయలుదేరాడు. మరుసటి రోజు కుమారుడు ఫోన్ పని చేయకపోవడంతో రూమ్‌లో ఉన్న మిత్రులకు మద్దిలేటి ఫోన్ చేశాడు. వారు ఇంటికి వెళ్లాడని చెప్పడం, రెండురోజులైనా రాకపోవడంతో అనుమానంతో విద్యార్థి తండ్రి ఆలూరుకు చేరుకుని కళాశాలలో విచారించారు. కుమారుడి ఆచూకీ లేకపోడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
సోమవారం పత్తికొండ గ్రామ శివారులోని హంద్రీనీవా కెనాల్‌లో కొందరు యువకలు ఈత కొడుతుండగా గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహంపై ఉన్న బ్యాగ్‌ను పరిశీలించగా మృతుడు ఆలూరు పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన మనోజ్‌గా గుర్తించారు. బ్యాగ్‌లోని రికార్డులు, మృతుడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు పత్తికొండ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.
పరీక్షల్లో తప్పినందుకేనా..?
మృతుడు మనోజ్ ఆలూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా సివిల్ కోర్సులో ఏడాది క్రితం చేరాడు. మొదటి సంవత్సరం కోర్సులో (ఫస్ట్ సెమిస్టర్‌కు సంబంధించి) కొన్ని సబ్జెక్టులను తప్పినట్లు సమాచారం. ద్వితీయ సంవత్సరంలో రెండు, మూడు సెమిస్టర్ కోర్సులు ఉంటాయి. అందులో రెండో సెమిస్టర్‌లో కొన్ని సబ్జెక్టులను ఆ విద్యార్థి తప్పినట్లు తెలిసింది. దీంతో మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తోటి విద్యార్థులు తెలుపుతున్నారు. విద్యార్థులు పరీక్షల్లో రాణించేందుకు కళాశాల అధ్యాపకులు సరైన సమయంలో సిలబస్‌ను కంప్లీట్ చేయకపోవడం, పరీక్షా సమయాల్లో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడిని అధ్యాపకులు తీసుకురావడంతోనే మనోజ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ కళాశాలకు చెందిన కొందరు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
Advertisement
Advertisement