హత్యాయత్నం కేసులో నలుగురి అరెస్ట్
ఏలూరు (సెంట్రల్) : సరిహద్దు తగాదాల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేసేందుకు యత్నించిన కేసులో నలుగురు నిందితులను టూటౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు విలేకరులకు వివరించారు. ఏలూరు రూరల్ మండలం చొదిమెళ్ల గ్రామానికి చెందిన బండి రాంబాబు, అతడి అన్న కుమారుడు బండి బాబూరావులకు వంగూరు సమీపంలో 40 సెంట్ల భూమి ఉంది. దాని పక్కనే మురారి రాజేశ్వరరావు అలియాస్ ఊకరాజుకు చెందిన పొలం ఉంది. ఊకరాజుకు ఇటుకల తయారీ పరిశ్రమ కూడా ఉంది. రాంబాబుకు చెందిన పొలంలో ఉన్న మట్టి దిబ్బను ఇటీవలే తవ్వించి ట్రాక్టర్లలో తరలించేందుకు అతను సిద్ధపడ్డాడు. దీనిని ఊకరాజు అడ్డుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరగ్గా ఊకరాజుకు గాయాలయ్యాయి. అతడిని ఏలూరులోని ప్రభుత్వాస్పత్రిలో చేర్చగా.. పెదవేగి పోలీసులు బాబూరావు, రాంబాబుSపై కేసు నమోదు చేశారు. దాంతో తమ సమస్యను ఏలూరు ఎమ్మెల్యే బుజ్జికి చెప్పుకునేందుకు ఈనెల 6న వారిద్దరూ ఏలూరు వచ్చారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో పాతబస్టాండ్ సమీపంలోని ఓ అద్దాల షాపులోకి వెళ్లారు. తిరిగి బయటకు వచ్చే సమయంలో వారిపై కొంత మంది వ్యక్తులు కత్తులతో దాడికి తెగబడ్డారు. స్థానికులు పెద్దగా కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న టూ టౌన్ పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి.. హత్యాయత్నానికి పాల్పడిన మురాల నాగబాబు, మురాల సీతారామయ్యతో పాటు నలుగురు నిందితులను శనివారం అరెస్ట్ చేశారు. ఈ హత్యాయత్నంలో ఊకరాజు మనుమలైన ఇద్దరు బాలురు పాల్గొన్నట్టు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తులు, ఒక కారు, రెండు మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. టూటౌన్ సీఐ జి.మధుబాబు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.