వివిధ శాఖల హెచ్‌ఓడీలతో డీఆర్వో సమావేశం
సంగారెడ్డి జోన్: విజయదశమి నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాల పునర్విభజనకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయడంతో అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డీఆర్వో దయానంద్ తన ఛాంబర్‌లో జిల్లాలోని ఇంజనీరింగ్ విభాగాలు, ఇరిగేషన్, వ్యవసాయం, సహకార శాఖ, విద్య, డీఆర్‌డీఏ, డ్వామా, సర్వశిక్షా అభియాన్, ట్రాన్స్‌కో తదితర శాఖల అధికారులతో సమావేశమయ్యారు. శాఖల వారీగా ఉద్యోగులు ఎంత మంది? ఎలా సర్దుబాటు చేయగలం..? కొత్త పోస్టులు ఎన్నింటిని సృష్టించవచ్చు? ఎన్ని కావాల్సి ఉంటాయన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాల ఆధారంగా కొత్తగా ఎన్ని పోస్టులు మంజూరు చేయాలన్న దానిపై కసరత్తు చేయడానికి అవకాశం ఉంది. కొన్ని శాఖల్లో అదనంగా ఉన్న సిబ్బందిని ఎలా తరలించాలన్న అంశాలపై ప్రధానంగా చర్చించారు. అర్హత కలిగిన సీనియర్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ భర్తిచేసే అవకాశం వుంది.