సొమ్ముల్లేవ్..
సొమ్ముల్లేవ్..
Published Fri, Dec 2 2016 11:42 PM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM
వ్యక్తిగత చెల్లింపులు రూ.5 వేలే
గ్రామీణ ప్రాంతాల్లో రు.2వేలే
పూర్తిస్థాయిలో అందుకోలేని పెన్షనర్లు
డబ్బులు అందక రాస్తారోకోలు, ఆందోళనలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
బ్యాంకులను సరిపడా డబ్బులు రాకపోవడంతో రెండో తారీఖున కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజల ఇక్కట్లు రెట్టింపయ్యాయి. పింఛన్ డబ్బుల కోసం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు బ్యాంకుల వద్ద బారులు తీరారు. జిల్లాలో ప్రతిచోట దాదాపు ఇదే పరిస్థితి కనపడింది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకుని సుమారు నెల రోజులు కావస్తున్నా జిల్లాకు సరిపడా నగదు అందుబాటులో లేకుండా పోతోంది. బ్యాంకుల్లో సొమ్ములు లేకపోవడం, ఏటీఎంలు కూడా అరకొరగా పనిచేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకూ పరిస్థితి మెరుగవుతుందని భావించగా, పరిస్థితి దయనీయంగా మారడంతో ఏంచేయాలో అర్థంకాని స్థితిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యక్తిగతంగా వారానికి రూ.24 వేలు డ్రా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో రూ.2 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5 వేల వరకూ మాత్రమే ఇస్తున్నారు.
సగం మందికైనా అందని పింఛన్లు
జిల్లా వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కల్లుగీత, చేనేత కార్మికులకు సంబంధించి ప్రతినెలా 3,38,000 మందికి రూ.37 కోట్లను పింఛన్ల రూపంలో చెల్లించాల్సి ఉంది. గడచిన రెండు రోజుల్లో కేవలం రూ.7 కోట్లు మాత్రమే ఆయా విభాగాల వారికి పింఛన్ల రూపంలో అందాయి.
ఉద్యోగులదీ అదే పరిస్థితి
జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో 34 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 6,800 మంది మాత్రమే బ్యాంకుల నుంచి సొమ్ములు డ్రా చేసుకున్నారు. అది కూడా రూ.3 వేలు, రూ.4 వేలు, రూ.5 వేల చొప్పున మాత్రమే బ్యాంకర్లు ఇచ్చారు.
ఏటీఎంలలో అవే నోట్లు
జిల్లాలో వివిధ బ్యాంకులకు సంబంధించి 585 శాఖలు ఉన్నాయి. 594 ఏటీఎంలు ఏర్పాటు చేయగా, గురు, శుక్రవారాల్లో 368 ఏటీఎంలు మాత్రమే పనిచేశాయి. వీటిలో కేవలం 62 ఏటీఎంలలో మాత్రమే రూ.100 నోట్లు పెట్టారు. మిగిలిన 306 ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఏటీఎంలు కూడా గంట, గంటన్నర మాత్రమే పనిచేశాయి. దీంతో పెన్షనర్లు పింఛను సొమ్మును బ్యాంకుల నుంచే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Advertisement
Advertisement