తన వాహన డ్రైవర్ వెంకోబ అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యారని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ నోటీసులు జారీ చేసినట్లు ఆలస్యంగా తెలిసింది.
- వడదెబ్బతో విధులకు గైర్హాజర్
- తనకు చెప్పలేదని నోటీసులిచ్చిన కలెక్టర్
- విచారణ చేయాలని డీఆర్‌ఓకు ఆదేశం
కర్నూలు (అగ్రికల్చర్): తన వాహన డ్రైవర్ వెంకోబ అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యారని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ నోటీసులు జారీ చేసినట్లు ఆలస్యంగా తెలిసింది. ఈనెల 7వ తేదీన కలెక్టర్ కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో పర్యటించాల్సి ఉండగా వడదెబ్బ కారణంగా వాహన డ్రైవర్ విధులకు రాలేక పోయాడు. ఈ క్రమంలో తన అనుమతి తీసుకోకుండా గైర్హాజర్ కావడం, తన విధులకు అంతరాయం కలిగించాడని, ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని డీఆర్‌ఓ ద్వారా డ్రైవర్‌కు నోటీసులు జారీ చేయించారు. తీవ్రమైన ఎండలతో వెంకోబ వడదెబ్బకు గురై ఆసుపత్రిలో చేరగా, డాక్టర్ ఐదు సెలిన్ బాటిళ్లు పెట్టి వైద్య సేవలు అందించినట్లు తెలిసింది. కాగా డ్రైవర్ వడబెబ్బ కారణంగానే ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాడా లేదా అనే విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని రెండు రోజుల క్రితం కలెక్టర్ డీఆర్‌ఓను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఈ విషయం చర్చనీయాంశమైంది.