పీఏసీఎస్ పనితీరు భేష్
ఇబ్రహీంపట్నం రూరల్: ఉప్పరిగూడ పీఏసీఎస్‌ను వాణిజ్య బ్యాంకులకు దీటుగా తీర్చిదిద్దడం బాగుందని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు కితాబిచ్చారు. ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ పరిధిలోని శేరిగూడ వార్డులో ఉన్న ఉప్పరిగూడ పీఏసీఎస్‌ను మంగళవారం 9 జిల్లాల సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు స్టడీటూర్‌లో వచ్చి సందర్శించారు. ఉప్పరిగూడ పీఏసీఎస్ సీఈఓ గణేష్‌ని సంఘం పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ర్టంలో ఎక్కడా లేని విధంగా సంఘాన్ని తీర్చిదిద్దడం చాలా బాగుందన్నారు. ఎక్కడ లేనన్ని డిపాజిట్లు సేకరించి రైతుల శ్రేయస్సుకోసం పాటుపడటం అభినందనీయమని తెలిపారు. క్యాష్ కౌంటర్, ఎరువుల, విత్తనాల కేంద్రాలు, ఏర్పాటు చేసి వాణిజ్య బ్యాంకులకు దీటుగా సంఘాన్ని తీర్చిదిద్దడం రాష్ర్టానికే గర్వకారణమని కొనియాడారు. గోల్డ్ లోన్లు, దీర్ఘకాలిక రుణాలు ఇచ్చి రైతులను ఆపదలో అదుకొవడం శుభపరిణామమని అన్నారు. రోజుకు రూ.50 లక్షలు టర్నోవర్‌తో సంఘం పని చేయడం నచ్చిందని అభిప్రాయం వ్యక్తపరిచారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ , మహబూబ్‌నగర్‌తో పాటు పలు జిల్లాలో పని చేస్తున్న సంఘాలను ఉప్పరిగూడ పీఏసీఎస్‌లాగా తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ర్టంలోనే ఉప్పరిగూడ పీఏసీఎస్ సేవలు రైతులకు అందుబాటులో ఉన్నయని ఇదే తరహాలో ఆయా జిల్లాలో నడిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 9 జిల్లాల చైర్మన్లు, సీఈఓలు పాల్గొన్నారు.