మంచిమాట
తమ ప్రతిభని ఎవరు ఎంత వరకు గ్రహించగలరో అంత వరకే ప్రదర్శిస్తారు ఉత్తములు. అంతే కాని తమకి ఉన్న పాండిత్యాన్ని అంతా ఎవరి వద్ద పడితే వారి వద్ద ప్రదర్శించరు.
ఒకటవ తరగతి చదివే పిల్లలకి వ్యాకరణం బోధిస్తే కంగారు పడి మళ్ళీ దాని జోలికి వెళ్ళటానికి ఇష్టపడరు. వారికి అక్షరాలు చాలు. అంత మాత్రానికే తమకి ఎంతో తెలుసు అనుకుంటారు. తనకి ఎంత తెలుసు అని కాదు, ఎదుటివారికి ఏమి కావాలి? ఎంత వరకు అర్థం చేసుకోగలరు? అన్నది ప్రధానం. ఈ మాట తుంబురుడి గాన విద్యా ప్రావీణ్యం చూసిన నారదుడు అనుకున్నది.
ఒక పాఠశాల వార్షికోత్సవంలో విద్యార్థుల కోసం పాడ మంటే రాగం, తానం, పల్లవి ఆలపిస్తే వారు జన్మలో శాస్త్రీయ సంగీతం జోలికి వెళ్లరు. అయినా ప్రతివారి వద్ద తమ ప్రతిభని ప్రదర్శించ వలసిన అవసరం లేదు. చెవిటి వాడి ముందు శంఖం ఊదితే కొరుకుడు పడటం లేదా? సహాయం చేయనా? అని అడుగుతాడు. అంతేకాదు ఎవరి వద్ద క్లుప్తంగా చె΄్పాలి, ఎవరి వద్ద వివరంగా చె΄్పాలి అన్నది కూడా తెలియ వలసిన అవసరం ఉంది.
మాట నేర్పరితనంలో ఇది ప్రధానమైన అంశం. దీనికి హనుమ గొప్ప ఉదాహరణం. సీతాదేవిని చూచి వచ్చిన హనుమ తన కోసం ఎదురు చూస్తున్న అంగదాదులతో ముందుగా ‘చూడబడినది నా చేత సీత’ అని క్లుప్తంగా చెప్పి, సావకాశంగా కూర్చొన్న తరువాత వారి కోరిక పైన తాను బయలుదేరిన దగ్గరనుండి ఆ క్షణం వరకు జరిగినదంతా పూసగుచ్చినట్టు చె΄్పాడు. అందులో తన ప్రతాపం చాలా ఉంది.
అది అంతా సత్యమే! అది విని ముఖ్యంగా యువరాజు, ఈ బృందనాయకుడు అయిన అంగదుడు, తన శక్తిని గుర్తించి, గుర్తు చేసి, వెన్నుతట్టి ప్రోత్సహించిన జాంబవంతుడు, కపులు సంతోషిస్తారు. పైగా కపివీరులు అవన్నీ తామే చేసినట్టు ΄÷ంగి ΄ోయారు. అదే విషయం సుగ్రీవ శ్రీరామచంద్రులతో క్లుప్తంగా చె΄్పాడు. వారు తన యజమానులు. వారి వద్ద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వారి సమయం విలువైనది. పైగా రాజుల వద్ద దాసులు తమ ఘనత చెప్పుకోకూడదు. అది రాచమర్యాద కాదు.
అందుకే తన ప్రతాపం ఎక్కడా మాటల్లో వ్యక్తం కాకుండా జాగ్రత్త పడ్డాడు. ఒక్క మాటలో సముద్రం లంఘించి వెళ్ళాను అని తేల్చి వేశాడు. అది మర్యాద మాత్రమే కాదు, వినయశీలత. విరాటరాజు కొలువులో ప్రవేశించటానికి వెడుతున్న పాండవులకు వారి పురోహితుడు ఇచ్చిన సూచనలు అందరికీ ఉపయోగ పడేవే. రాజుకన్న విలువైన వస్త్రాలు ఆభరణాలు ధరించ కూడదు, రాజుగారి భవనాని కన్న పెద్ద, ఎతై ్తన భవనంలో ఉండ కూడదు అన్నవి ఇక్కడ పేర్కొన దగినవి. తమ ఘనత సందర్భానుసారం ప్రకటించాలి. ఎదగటం లేదా ఒదగటం పరిస్థితులను అనుసరించి ఉండాలి.
పిడుగుకి బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్టు ఉండరు తెలివైన వారు. దీనికి చక్కని ఉదాహరణ చెపుతాడు పింగళి సూరన.‘‘ఉత్తముల మహిమ నీరు కొలది తామర సుమ్మీ’’ అని. చెరువులో నీటి మట్టం పెరిగితే తామర కాడ చుట్లు విచ్చుకొని, పువ్వు గాని, మొగ్గ గాని ఆకు గానీ ఉపరితలం మీద తేలుతాయి. నీరు తగ్గితే కాడ చుట్టలు చుట్టుకొని పువ్వు మాత్రమే నీటి ఉపరితలం మీద ఉంటుంది. నీరు ఎండి΄ోతే దుంపలో తన జీవశక్తిని నిక్షిప్తం చేసి ముడుచుకొని ΄ోయి ఉంటుంది. నీరు నిండితే
చిగురిస్తుంది. ఉత్తముల గొప్పతనం కూడా అంతే!
– డా. ఎన్. అనంతలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment