కోటిలింగాలు ఎక్కడ ? | piligrims not getting kotilingalu in rajamandry | Sakshi
Sakshi News home page

కోటిలింగాలు ఎక్కడ ?

Published Thu, Jul 16 2015 11:05 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

కోటిలింగాలు ఎక్కడ ? - Sakshi

కోటిలింగాలు ఎక్కడ ?

కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) : ఇక్కడ కోటిలింగాలు ఉన్నాయంటకదా.. ఎక్కడున్నాయి బాబూ అంటూ కోటిలింగాల రేవుకు పుణ్యస్నానాలకు వచ్చిన అనేక మంది యాత్రికులు ఆసక్తిగా ప్రశ్నించారు. ఈ రేవులో కోటి లింగాలున్నాయని, అందువల్లే ఈ రేవుకు ఈ పేరు వచ్చిందని నానుడి ఉండడంతో అందరూ వాటిని చూసేందుకు ఉత్సుకత కనబరిచారు.  అయితే అవి ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియక పోవడం.. ఎక్కడా కనిపించకపోవడంతో వాటి కోసం ఆరా తీశారు. తీరా కోటిలింగాలు లేవని తెలియడంతో ఒకింత నిరాశకు గురయ్యారు.
 
రేవుకు ఆ పేరు ఎందుకొచ్చిందంటే!
కుమార సంభవ సమయంలో రాక్షసులమీద శివుని స్వేద బిందువులు పడడంతో ఆ రాక్షసులందరూ శివలింగాలుగా మారిపోయారని పురాణాలు చెబుతున్నాయి. ఆ శివలింగాలన్నీ గోదావరి జన్మస్థానమైన నాశిక్ నుంచి వరుసగా ప్రతిష్టించుకుంటూ రాగా.. రాజమండ్రి కోటిలింగాలరేవు వద్దకు వచ్చేసరికి ఒక లింగం తక్కువ రావడంతో ఆ శివలింగాన్ని కాశీ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించడంతో కోటిలింగాలు పూర్తయ్యాయి. దీంతో ఈ రేవుకు కోటిలింగాలుగా పేరొచ్చిందని, ఇక్కడ ఉమా కోటిలింగేశ్వరస్వామిగా శివుడు పూజలందుకుంటున్నాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే పూర్వం నుంచి కోటిలింగాల రేవుగా ప్రసిద్ధి చెందడంతో భక్తులు ఈ ఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అప్పట్లో ప్రతిష్టించిన కోటి శివలింగాలు కాలక్రమేణా గోదావరిలో కలిసిపోవడంతో ఎవరికీ కనిపించవని చరిత్రకారులు చెబుతున్నారు.
 
కోటిలింగాలను చూద్దామని వచ్చా
ఇక్కడ కోటిలింగాలుంటాయనుకుని వచ్చా. వాటిని ఓ సారి చూసి తరిద్దామనుకున్నా. కానీ ఇక్కడ కోటిలింగాలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదంటున్నారు. ఇది కొంత నిరాశ కలిగించింది.
 - ఎ.సుబ్బారావు, ఒంగోలు
 
అది చరిత్ర మాత్రమే
కోటిలింగాలు అనేది చరిత్రలో మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కోటిలింగాలు కనిపించవు. చాలా మందికి ఈ విషయం తెలియక ఇక్కడ కోటిలింగాలు ఉన్నాయనుకుంటారు.                         

- జి.సుబ్రహ్మణ్యం,    ఉమా కోటిలింగేశ్వరస్వామి దేవస్థాన ఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement