బుట్టాయగూడెం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యే అవకాశం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. శనివారం బుట్టాయగూడెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తయితే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందనే అక్కసుతోనే చంద్రబాబు పనులు పూర్తి చేయకుండా కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. బహుళ ప్రయోజనాలు ఉన్న పోలవరం ప్రాజెక్టును కాదని పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు. 2018 నాటికి Sపోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఎలా పూర్తి చేస్తుందో శ్వేత పత్రం విడుదల చేయాలని బాలరాజు డిమాండ్ చేశారు. పార్టీ నేతలు ఆరేటి సత్యనారాయణ, గాడి వెంకటరెడ్డి, కొదం కడియ, కణితి ఉమ, ఎంపీటీసీ తెల్లం రమణ పాల్గొన్నారు