ఎస్సై వైఖరికి నిరసనగా ఆందోళన
ఎస్సై వైఖరికి నిరసనగా ఆందోళన
Published Mon, Sep 26 2016 11:09 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM
ఇంద్రపాలెం వంతెన వద్ద రాస్తారోకో
చర్య తీసుకోవాలని డీఎస్పీకి వినతి
కాకినాడ రూరల్ :చిరు వ్యాపారులు, వినియోగదారులపై ఇంద్రపాలెం ఎస్సై జులుం ప్రదర్శిస్తున్నారని, ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ కొవ్వాడ, చీడిగ, ఇంద్రపాలెం గ్రామాలకు చెందిన వ్యాపారస్తులు సోమవారం ఇంద్రపాలెం వంతెన వద్ద రాస్తారోకో నిర్వహించారు. సాయంత్రం సమయంలో వ్యాపారాలు జరుగుతున్న సమయంలో ఎస్సై సిబ్బందితో వచ్చి వ్యాపారస్తులను తిడుతూ, వినియోగదారులు రోడ్డుపక్కన పెట్టే వాహనాలు తీసుకుపోయి కేసులు నమోదు చేస్తున్నారని వ్యాపారస్తులు వివరించారు. ఆదివారం ఇంద్రపాలెం నేరేళ్లమ్మ తల్లి గుడి సమీపంలో వ్యాపారస్తునిపై చేయి చేసుకోవడంతో మూడు గ్రామాలకు చెందిన చిరువ్యాపారులు ఆందోళనకు దిగారు. చీడిగ, ఇంద్రపాలెంల గుండా ర్యాలీగా వ్యాపారస్తులు వచ్చి ఇంద్రపాలెం వంతెన వద్ద రాస్తారోకో చేశారు. అనంతరం ర్యాలీగా డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ ధర్నా చేశారు. అనంతరం డీఎస్పీ వెంకటేశ్వరరావును కలసి వినతిపత్రం అందించారు. ఈ ఆందోళనలో పుప్పాల బాబీ, మాజీ సర్పంచ్‌లు కొప్పిశెట్టి నాగేశ్వరరావు, గోపిశెట్టి వీర వెంకటసత్యనారాయణలతోపాటు వ్యాపారులు పాల్గొన్నారు.
Advertisement