
నిరసనలు..నిలదీతలు!
నిరసనలు.. నిలదీతలు..అసంతృప్తులు..వాగ్వాదాలతో జన్మభూమి సభలు రసాభాసగా మారాయి.
- హొళగుంద మండలం మార్లమడికి మజరా గ్రామమైన వన్నూరు క్యాంపులకు రోడ్డు, బస్సు సదుపాయం లేదు. బస్సు వసతి కల్పించాలని గత జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు. అధికారులు కూడా హామీ ఇచ్చారు. కాని ఇప్పటికి సౌకర్యం లభించలేదు. నాలుగో విడత జన్మభూమి సభలో ప్రజలు మూకమ్మడిగా అధికారులను నిలదీశారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపని జన్మభూమి కార్యక్రమాలు ఎందుకు... దండగా అంటూ ప్రజలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
- కర్నూలు మండలం ఇ.తాండ్రపాడు గ్రామంలో ఫించన్లు, రేషన్ కార్డులు రాలేదని ప్రజలు నిరసన తెలిపారు. గత జన్మభూమి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారిలో ఒక్కరికి మంజూరు కాలేదని మండిపడ్డారు.
- మద్దికెర మండలం పెరవలి గ్రామంలో వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన వారనే ఉద్దేశంతో పింఛన్లు ఇవ్వడం లేదని గ్రామస్తులు అధికారులపై మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు కేవలం తెలుగుదేశం వారికేనా అంటూ నిలదీశారు.
- ఆత్మకూరు మండలం బాపునంతపురం గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లకు బిల్లులు ఇవ్వకపోవడంపై ప్రజలు.. అధికారులను నిలదీశారు. బిల్లులు ఇవ్వనపుడు..మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఎందుకు చెప్పాలి అంటూ ప్రశ్నించారు.
- ఆళ్లగడ్డ, అవుకు, ఆలూరు, కోడుమూరు, బనగానపల్లె, ప్యాపిలి, బేతంచెర్ల తదితర మండలాల్లో జనాలు లేక జన్మభూమి సభలు వెలవెలబోయాయి.