మోదీ విధానాలతో ఐక్యత ప్రశ్నార్థకం
• సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు
సూర్యాపేట: ప్రధాని మోదీ అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలతో దేశంలో ఐక్యత ప్రశ్నార్థకంగా మారిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ప్రారంభమైన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉగ్రవాదుల దాడులను వ్యూహాత్మకంగా వ్యవహరించి తిప్పికొట్టాలి.. కానీ, భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పరిణామాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.
ఉడీలో ఉగ్రవాదులు దాడి చేసి 19 మంది జవాన్లను పొట్టనపెట్టుకుంటే ఎన్డీయే ప్రతినిధి ప్రతిపక్షాలపై విరుచుకు పడడంలో అర్థం లేదన్నారు. కాగా, ప్రజల సౌలభ్యం కోసం జిల్లాల విభజన చేయడం మంచిపనే కానీ శాస్త్రీయ పద్దతిలో వ్యవహరించకుండా సీఎం తన లక్కీ నంబర్ కోసం అవసరమైతే 42 జిల్లాలను కూడా చేసేందుకు ప్రయత్నా లు చేస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఆరోపించారు.జిల్లాల విభజన పూర్తయ్యే వరకు రెండుసార్లు అఖిలపక్షాన్ని పిలుస్తానని చెప్పి ఎందుకు పిలవలేదన్నారు.