ఆ రాక్షసులను చంపేయండి.. లేదంటే నేనే చంపుతా!
► నరకం అనుభవించా.. నా బాధ అర్థం కావట్లేదా?
► పోలీసులు లంచం తీసుకుని నిందితులను
► కాపాడే ప్రయత్నం చేస్తున్నారు
► నన్ను బలవంతంగా తీసుకెళ్తున్నప్పుడు
► నా స్నేహితురాలు పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు
► కీచకులను ఎన్‌కౌంటర్ చేయాలి: యువతి తల్లిదండ్రులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/వీణవంక
‘‘నా బాధ అర్థం కావడం లేదా..? నే ను నరకయాతన అనుభవించా. అదంతా టీవీల్లో చూశారు. ఆ రాక్షసులను పోలీసులు వెంటనే చంపేయాలి.. వారు ఆ పని చేయకుంటే నేనే చంపేస్తా. ఈ భూమ్మీద వాళ్లకు బతికే హక్కు లేదు...’’ కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరులో కామాంధుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలి ఆక్రోశమిది! పోలీస్ కావాలన్న ఆశతో కోచింగ్‌కు వెళ్లానని, కానీ అక్కడే తన బతుకు నాశనమవుతుందని ఊహించలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. పోలీసులు లంచాలు తీసుకొని ఆ కామాంధులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. బాధితురాలు ఆదివారం తన ఆవేదనను ‘సాక్షి’తో పంచుకుంది.
తనపై అఘాయిత్యం చేసేందుకు బలవంతంగా తీసుకెళుతున్న సమయంలోనే తన స్నేహితురాలు పోలీసులకు ఫోన్ చేసి సమాచారమిచ్చిందని, అయినా వారు పట్టించుకోలేదని తెలిపింది. ‘‘ఈ నెల 10న వాళ్లు నన్ను బలవంతంగా తీసుకెళ్లిండ్రు. ఆ సమయంలో నా ఫ్రెండ్ వీణవంక ఎస్సైకి ఫోన్ చేసినా పట్టించుకోలేదు. కనీస స్పందన కూడా లేదు. వాళ్ల దగ్గర లంచాలు తీసుకుని కాపాడుతున్నారు. అసలు ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది? ఒక అమ్మాయికి రక్షించకపోతే పోలీసులు ఇంకేం చేస్తారు’’ అని ఆమె నిలదీసింది. కీచకులను ఎన్‌కౌంటర్ చేయాలని బాధితురాలి తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేశారు. నిందితుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సైతం ఇది క్షమించరాని నేరమని పేర్కొన్నారు. కొడుకును ప్రయోజకుడిని చేసేందుకు కూలీ పనులు చేసి చదివిస్తే ఇంతటి కిరాతకానికి పాల్పడతాడని ఊహించలేదని ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ తల్లి సమ్మక్క రోదించింది. తన భర్త మంచివాడేనని, స్నేహితుల వల్లే ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడని మరో నిందితుడు అంజయ్య భార్య లావణ్య వాపోయింది. మరోవైపు ఈ దారుణంపై రాష్ట్రవ్యాప్తంగా మహిళా, పౌరహక్కుల, దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.
నా బిడ్డ కలలు కూలిపోయినయ్: బాధితురాలి తల్లిదండ్రులు
సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలి తల్లిదండ్రులకు నలుగురు ఆడపిల్లలు. బాధితురాలు పెద్ద కుమార్తె. పోలీస్ కావాలని ఎన్నో కలలు కన్న తన బిడ్డ జీవితం నాశనమైందని ఆమె తల్లిదండ్రులు రోదిస్తున్నారు. ‘‘నా బిడ్డ పోలీస్ కావాలని కలలు కన్నది. రోజూ కోచింగ్ సెంటర్‌కు వెళ్లేది. ఇవాళ నా బిడ్డ కలలన్నీ కూలిపోయినయ్. నా బిడ్డకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఏ చర్యా తీసుకోలేదు. మూడు రోజులపాటు స్టేషన్ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. అమ్మాయిని తీసుకెళ్లి ఫిర్యాదు చేయించినా వినలేదు. పైగా లేడీ కానిస్టేబుల్‌తో రకరకాల ప్రశ్నలు అడిగించారు. ఎస్సై, సీఐ మాటలతో ఘోరంగా హింసించిండ్రు. ఏమని చెప్పుకోలేని పరిస్థితి. నా బిడ్డలాంటోళ్లు బయట చాలామంది ఉన్నారు. వాళ్లు బలికావొద్దంటే ఆ రాక్షసులను ఎన్‌కౌంటర్ చేసి చంపేయాలి. వీళ్లను వదిలేస్తే నా బిడ్డలాంటోళ్లు ఎందరో బలైపోతరు. ఇప్పుడు మేం బయటకు వెళ్లాలంటేనే కష్టంగా ఉంది. ఆమె బతుకు నాశనమైంది. కనీసం ప్రభుత్వమైనా నా బిడ్డను ఆదుకోవాలి’’ అని కన్నీరుమున్నీరయ్యారు.
క్షమించరాని పని చేశాడు: సమ్మక్క, నిందితుడు గొట్టె శ్రీనివాస్ తల్లి
నా కొడుకు క్షమించరాని పనిచేశాడు. ప్రయోజకుడు అవుతాడని కూలీ పనులు చేసి చదివిస్తే బీటెక్ మధ్యలో మానేశాడు. వీణవంక మండలంలో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం శిక్షణకు వెళ్తుంటే సంతోషించాం. కానీ ఇలా చేస్తాడనుకోలేదు
స్నేహితుల వల్లే..: లావణ్య, నిందితుడు అంజి భార్య
కానిస్టేబుల్ ఉద్యోగం కోసం వీణవంక పోలీసులు ఏర్పాటు చేసిన శిక్షణకు నా భర్త అంజి రోజు వెళ్లే వాడు. మా చిన్న మామ కొడుకు రాకేశ్, అంజి జమ్మికుంటలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నారు. ఆముదాపల్లెకు చెందిన శ్రీనివాస్ స్నేహంతోనే నా భర్తకు చెడ్డ పేరు వచ్చింది. ఆడపిల్లపై వీరు చేసిన ఈ పని క్షమించరానిది . ఈ సంఘటనలో నా భర్త ఉన్నాడంటే నమ్మలేక పోతున్నాను. ఆ బాధితురాలు నా చెల్లెలు లాంటిది. నిండు గర్భవతిని అయిన నన్ను చూసి ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టాలి. లేకుంటే ఆత్మహత్యే నాకు శరణ్యం.