
ఇంట్లో ఉండగానే కూల్చేశారు
- రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్‌లో రెవెన్యూ అధికారుల ఓవరాక్షన్
- అక్రమ నిర్మాణాల పేరిట కూల్చివేతలు
- ఇంట్లో భోజనం చేస్తున్న కూలీపై విరిగిపడ్డ ఇటుకలు, మట్టి పెళ్లలు
- తీవ్రగాయాలతో స్పృహ కోల్పోయిన వైనం
- ఆలస్యంగా గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన తహసీల్దారు
హైదరాబాద్: ఇంట్లో ఎవరైనా ఉన్నారో లేరో కూడా చూడలేదు.. వచ్చిందే తడవుగా పేదోడి గూడుపైకి బుల్డోజర్ పంపారు.. అప్పుడే వచ్చి ఆ ఇంట్లో భోజనం చేస్తున్న ఓ కూలీపై ఇటుకలు, మట్టి పెళ్లలు పడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు! బడాబాబుల అక్రమ భవంతుల వైపు కన్నెత్తి చూడడానికి సైతం భయపడే రెవెన్యూ యంత్రాంగం.. గరీబోళ్ల ఇళ్లపై చూపిన ప్రతాపమిది! కనీసం ఇంట్లో సామాన్లను కూడా తీసుకోనివ్వకుండా కూల్చివేతల పర్వాన్ని కొనసాగించారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా కేవలం స్థానిక ప్రజాప్రతినిధి ఫిర్యాదుతో వచ్చిన అధికారులు ఇలా ఓవరాక్షన్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. శనివారం రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట తహసీల్దార్ దేవుజా ఆధ్వర్యంలో జవహర్‌నగర్, అంబేద్కర్‌నగర్ ప్రాంతంలోని పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.
ఈ క్రమంలో దేవేందర్‌నగర్‌లోని ఓ పాత ఇంటిని కూల్చిన అనంతరం పక్కనే ఉన్న మరో ఇంటి వెనక భాగాన్ని జేసీబీతో కూల్చారు. ఈ సమయంలో ఆ ఇంట్లో ఉన్న తాడిశెట్టి శ్రీనివాసరావు(50) కూలీ పనిచేసుకుని అప్పుడే వచ్చి ఇంట్లో భోజనం చేస్తున్నాడు. అంతలోనే కూల్చివేయడంతో ఆయనపై ఇటుకలు, మట్టి పెళ్లలు పడ్డాయి. వాటి కింద నలిగిపోయిన శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన తహసీల్దార్ సిబ్బందితో కలసి శ్రీనివాసరావును శిథిలాల నుంచి వెలికితీశారు. వెంటనే దమ్మాయిగూడలోని శ్రీఆదిత్య ఆస్పత్రికి, అక్కడ్నుంచి ఈసీఐఎల్‌లోని తులసి ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు.
పెద్ద ప్రమాదం జరగలేదు
అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటిని పరిశీలించాలని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చెప్పారు. దీంతో ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డికి విషయం చెప్పి కూల్చివేతలు చేపట్టాం. జేసీబీ వెనుక భాగం ఇంటికి వెనుక వైపు తగలడంతో కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో శ్రీనివాసరావు ఉన్న విషయం గమనించలేదు. అయినా పెద్ద ప్రమాదం జరగలేదు. అతడిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నాం.
- దేవుజా, శామీర్‌పేట తహసీల్దార్
పేదల ఇళ్ల కూల్చివేతకు కుట్ర
తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలపై నిరంకుశ ంగా వ్యవహరిస్తోంది. వారి ఇళ్లను తొలగించి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తోంది. జవహర్‌నగర్‌లో నివసించే పేద ప్రజలందరి ఇళ్లను కూల్చేందుకు చాలా రోజులుగా కుట్ర పన్నుతోంది. మనిషి ఇంట్లో ఉండగానే కూల్చివేయడం దారుణం.
- కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే
పేదలను రోడ్డున పడేస్తారా..?
నిరుపేదలకు డబుల్‌బెడ్రూం ఇళ్లు కట్టిస్తాం.. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ఓ వైపు హడావుడి చేస్తుంటే మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, శామీర్‌పేట తహసీల్దార్ దేవుజా మాత్రం పేదల ఇళ్లపై ప్రతాపం చూపిస్తున్నారు. 60 గజాల్లో ఉంటున్న పేదల ఇళ్లను కూల్చడం నిరంకుశం. ఈ ఘటనకు కారణమైన తహసీల్దార్ దేవుజాను సస్పెండ్ చేయాలి. దీనిపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం.
- కొంపల్లి మోహన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి
పేదల గుడిసెలు కూల్చడం న్యాయం కాదు
పేదల ఇళ్లను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం జీవోలు తీసుకువచ్చి కోట్ల రూపాయలు వసూలు చేసింది. జీవో 58, 59 ప్రకారం దరఖాస్తులు, డీడీల రూపంలో డబ్బులు గుంజింది. మరి ఇప్పుడు ఇళ్లు ఎందుకు కూల్చుతున్నారు? వందల ఎకరాలను వదిలేసి పేదల గుడిసెలను కూల్చడం న్యాయం కాదు.
-గోవర్ధన్, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ
ఇదేనా బంగారు తెలంగాణ?
పొట్ట చేతపట్టుకుని పట్నం వచ్చిన పేద ల ఇళ్లను కూల్చివేయడం దారుణం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓట్లకు ముందు పేదలందరికి ఇళ్లు కట్టిస్తానని హమీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మరిచిపోయింది. ఇదేనా బంగా రు తెలంగాణ..? -బాల మల్లేశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి