రాజ్‌పల్లిలో ఎండిన పంటకు నీళ్లు పెడుతున్న దృశ్యం
- వేసవిని తలపిస్తున్న ఎండలు
- రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- కానరాని వర్షాలు.. ఎండుతున్న పంటలు
- ఆందోళనలో అన్నదాతలు.. పంటల రక్షణకు పడరాని పాట్లు
మెదక్: ఎండలు మండుతున్నాయి. ఇరవై రోజులుగా వేసవిని తలపిస్తున్నాయి. గడిచిన మూడు రోజుల్లో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుత సీజన్‌లో వర్షాలు జోరుగా కురిసి చెరువులు, కుంటలు నిండాలి. కాని వేసవిని తలపిస్తూ ఎండలు మండుతుండటంతో ఆరుతడి పంటలు ఎండిపోతున్నాయి. వాటిని రక్షించుకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు.
ముఖ్యంగా మొక్కజొన్న పంట కంకిదశలో ఉంది. వర్షాలు లేకపోవడంతో పంట పెరుగుదల ఆగిపోయింది. దీంతో ఆ పంట రక్షణకు ఇంటిల్లిపాది నీళ్లుపోసి రక్షించే పనిలో పడ్డారు. రెండేళ్లుగా కరువు, కాటకాలతో విలవిల్లాడిన రైతులు పట్టణాలకు వలసవెళ్లిపోయారు. ఈసారైనా సాగు చేసుకుని జీవనం సాగిద్దామని పల్లెలకు వస్తే.. వారికి ఈసారీ నిరాశే మిగులుతోంది. ఆరుతడి పంటలైన మొక్కజొన్న, మినుములు, కంది, పెసర్లను అడపాదడపా కురిసిన వర్షాలకు రైతులు సాగుచేశారు.
1.22లక్షల హెక్టార్లలో మొక్కజొన్న, 27 వేల హెక్టార్లలో పెసర, 16 వేల హెక్టార్లలో మినుములు, 40 వేల హెక్టార్లలో కంది పంటలను సాగుచేశారు. అలాగే 82 వేల హెక్టార్లలో వరి సాగుచేయాల్సి ఉండగా, సరైన వర్షాలు లేక 35 వేల హెక్టార్లలోనే సాగుచేశారు. ఈ నెలలో వర్షాలు పూర్తిగా ముఖం చాటేయడంతో ఎండలు మాత్రం వేసవిని తలపించేలా దంచి కొడుతున్నాయి.
ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో 28 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కావొద్దని, అయితే మూడు రోజులుగా 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం వేళలో ఎండతీవ్రతకు ఇంట్లోంచి కాలు బయట పెట్టాలంటే జంకుతున్నారు. ఫ్యాన్లు, కూలర్స్ లేకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది.
ఎట్లా బతకాలో..
కరువు రక్కసితో రెండేళ్లుగా బతకడం చాలా కష్టమైంది. కనీసం గ్రామాల్లో పనిచెప్పేవారే లేకపోవడంతో ఉప్పిడి ఉపవాసం ఉన్నాం. ఈసారైనా వర్షాలు కురుస్తాయనుకుంటే మళ్లీ కరువే ముంచుకొస్తుంది. ఎట్లా బతకాలో తెలియడం లేదు. ఎకరం పొలంలో రూ.15వేల అప్పుచేసి మొక్కజొన్న వేశాను. వర్షాలు లేక ఎండిపోతోంది. - మార్గం వెంకయ్య, రైతు, రాజ్‌పల్లి
అప్పు చేసి మొక్కజొన్న వేసిన
ఈయేడు వర్షాలు సరిగా కురవక పోవడంతో 3 ఎకరాలలో రూ.30వేలు అప్పులుచేసి మొక్కజొన్న వేశాను. ప్రస్తుతం పంట కంకిదశలో ఉంది. వర్షాలు కురవక పోవడంతో గింజలు గట్టి పడటం లేదు. పెట్టుబడి కూడా చేతికొచ్చేటట్లు లేదు. బతుకును తలుచుకుంటేనే భయంగా ఉంది. - గురజాల నర్సింలు, రైతు, రాజ్‌పల్లి