విత్తన పంపిణీ ప్రారంభం
– మొదటి రోజు ట్రయల్‌కే పరిమితం
– సెల్ ఉంటేనే విత్తనాలు
– ఆన్‌లైన్‌లో భూముల వివరాలు లేపోతే మొండిచేయి
కర్నూలు(అగ్రికల్చర్): ఎట్టకేలకు రబీ సీజన్‌కు సంబంధించి శనగ విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. శనివారం మండల వ్యవసాయాధికారులు బయోమెట్రిక్ విధానంలో విత్తనాల పంపిణీ ప్రారంభించారు. మొదటి రోజు మూడు, నాలుగు మండలాల్లోనే విత్తన పంపణీ చేపట్టారు. సోమవారం దాదాపు అన్ని మండలాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. కర్నూలు మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమాన్ని జేడీఏ ఉమామహేశ్వరమ్మ పరిశీలించారు. 51 మండలాల్లో విత్తన పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సబ్సిడీ విత్తనాలు పొందాలంటే రైతుకు విధిగా సెల్‌ఫోన్ ఉండాల్సి ఉంది. సెల్ లేకపోతే కనీసం ఎవరిదైనా తెచ్చుకోవాల్సి ఉంది. ఆధార్ కార్డు విధిగా తీసుకెళ్లాలి. యూప్‌ను డౌన్‌లోడ్ చేసిన ట్యాబ్‌ల్లో రైతుల ఆధార్ నెంబరు నమోదు చేస్తే వెబ్‌ల్యాండ్ డేటా వస్తుంది. భుముల వివరాలు ఆన్‌లైన్‌లో ఉన్నా వాటిని ఆధార్‌తో లింకప్ చేసి ఉండాలి. లింకప్ అయి ఉంటేనే వెబ్‌ల్యాండ్ డేటా వస్తుంది. వెబ్‌ల్యాండ్‌లో ఉన్న భూములకు అనుగుణంగా గరిష్టంగా ఒక రైతుకు 125 కిలోలు ఇస్తారు. రైతులు బయోమొట్రిక్ డివైజ్‌పై వేలిముద్ర వేసిన వెంటనే వారి ఫోన్‌కు వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. ఆ తర్వాత విత్తన పంపిణీ కేంద్రానికి పాస్‌వర్డ్ చూపించాలి. దాని ద్వారా రైతు వివరాలను తమ దగ్గర ఉన్న ట్యాబ్‌లో సరిపోల్చుకున్న తర్వాత నాన్ సబ్సిడీ మొత్తాన్ని తీసుకుని విత్తనాలు ఇస్తారు. భూముల వివరాలు ఆన్‌లైన్‌లో లేకపోతే రైతులు వెంటనే సంబంధిత తహసీల్దారును కలసి నమోదు చేయించుకోవాలని కర్నూలు మండల వ్యవసాయాధికారి అశోక్‌కుమార్‌రెడ్డి సూచించారు.