భూమాకు కన్నీటి వీడ్కోలు
భూమాకు కన్నీటి వీడ్కోలు
Published Mon, Mar 13 2017 10:09 PM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM
– అశ్రునయనాల మధ్య భూమా అంతిమ యాత్ర
– భారీగా తరలివచ్చిన ప్రముఖులు
– జనసంద్రమైన ఆళ్లగడ్డ
– అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
అభిమాన నేత భూమా నాగిరెడ్డిని కడసారి చూసేందుకు ఊర్లు ఊర్లే కదిలివచ్చాయి. ప్రియతమ నాయకుడు ఇక లేడని తెలిసి అభిమానుల కళ్లు చెమ్మగిల్లాయి. అన్న ఇక తిరిగి రాడని..ఆప్యాయ పలుకులు ఉండబోవని అనుచరులు కుమిలి కుమిలి ఏడ్చారు. నాన్నా..ఇక మాకెవరు దిక్కంటూ కుమార్తెలు అఖిల ప్రియ, నాగ మౌనిక రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ప్రజా నాయకుడిగా..సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా భూమా నిలిచిన తీరు నాయకగణం కీర్తించింది. ఆళ్లగడ్డలో సోమవారం నంద్యాల ఎమ్మెల్యే భూమా అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య కొనసాగాయి. సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు, ముఖ్యనేతలు భూమా పార్థీవ శరీరంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు.
భూమా కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.
ఆళ్లగడ్డ: గుండె పోటుతో మృతి చెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి సోమవారం ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవను ప్రశంసించారు. అండగా నిలిచిన వారికోసం ఆయన చేసిన పోరాటాన్ని కొనియాడారు. ఆదివారం ఉదయం ఇంట్లో ఉండగా గుండెపోటు రావడంతో భూమా నాగిరెడ్డి ఆకస్మికంగా మృతి చెందిన విషయం విదితమే. అభిమానుల సందర్శనార్థం భూమా పార్థీవ దేహాన్ని ఆళ్లగడ్డలోని ఆయన స్వగృహంలో ఉంచారు. భూమాకు నివాళులర్పించేందుకు సోమవారం ఉదయం నుంచే అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. విగతజీవిగా ఉన్న ప్రియతమ నాయకుడిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. జై భూమా.. భూమా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భారీ జనసమూహం మధ్య భూమా పార్థీవ దేహాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి వైపీపీఎం కళాశాల, పాత బస్టాండు మీదుగా శోభా ఘాట్ వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. ప్రియతమ నాయకుడిని కడసారి చూసుకునేందుకు ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గం నుంచే కాక రాయలసీమ జిల్లాల్లోని అనేక ప్రాంతాలనుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. దీంతో భూమా గృహంతోపాటు ఆళ్లగడ్డలోని ప్రధాన రహదారి జనసంద్రంగా మారింది.
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. నిబంధనల ప్రకారం పోలీస్ పరేడ్ నిర్వహించి, ఆకాశంలోకి తుపాకీతో కాల్పులు జరిపిన అనంతరం భూమా చితికి ఆయన కుమారుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి నిప్పటించారు.
హాజరైన పలువురు నేతలు
భూమా అంత్యక్రియలకు రాష్ట్రంలోని పలువురు నాయకులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్, ఉపముఖ్యమంత్రులు కేయి కృష్ణమూర్తి, చినరాజప్ప, మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వర రావు, పీతల సుజాత, పరిటాల సునీత, అచ్చన్నాయుడు, కర్నూలు ఎంపీ బుట్టారేణుక, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, కేంద్ర మంత్రి సుజనాచౌదరి, స్పీకర్ కోడెల శివప్రసాదు, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి.. తదితరులు భూమా నాగిరెడ్డి మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
Advertisement