- సీఎం దత్తతగ్రామమై ఎర్రవల్లిలో అభివృద్ధి పనులను పరిశీలించిన జేసీ వెంకట్రాంరెడ్డి
జగదేవ్‌పూర్: శ్రావణ మాసం దగ్గరకు వస్తోంది..పనుల్లో వేగం పెంచాలి..సమయం తక్కువగా ఉంది..చాలా రోజులయ్యే.. ఊరికి రాక.. పనులెట్లా జరుగుతున్నాయ్.. అంటూ జేసీ వెంకట్రాంరెడ్డి మంగళవారం రాత్రి సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లి వీడీసీ సభ్యులతో అన్నారు. మంగళవారం రాత్రి 7 గంటల సమీపంలో సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో జేసీ వెంకట్రాంరెడ్డి, గడా అధికారి హన్మంతరావుతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో చేపడుతన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఇళ్ల పనులు ఎంత వరకు వచ్చాయంటూ మీనాక్షి కంపెనీ ప్రతినిధులను, వీడీసీ సభ్యులను ఆడిగి తెలుసుకున్నారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం శ్రావణ మాసం దగ్గరకు వస్తోందని, పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. ఫంక్షన్‌హాల్, గోదాం, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు కిష్టారెడ్డి, సభ్యులు బాల్‌రాజు, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.