‘పచ్చ’పాతంగా సైకిళ్ల పంపిణీ
‘పచ్చ’పాతంగా సైకిళ్ల పంపిణీ
Published Wed, Jun 21 2017 11:34 PM | Last Updated on Tue, Oct 2 2018 7:21 PM
- టీడీపీ జెండాలతో విద్యార్ధినీలతో ర్యాలీ
పిఠాపురం మండలం విరవాడ జిల్లా ప్రజాపరిషత్ పాఠశాలలో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ ‘పచ్చ’పాతంగా చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. స్థానిక పాఠశాల ఆవరణలో బుధవారం బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా 9వ తరగతి చదువుతున్న 65 మంది విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు. తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహానికి ఉపాధ్యాయులు తల ఊపడంతో పంపిణీ చేసిన సైకిళ్లకు తెలుగుదేశం పార్టీ జెండాలను కట్టారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని టీడీపీ కార్యక్రమంగా మార్చేసి విద్యార్థినులతో గ్రామంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేశారు. సైకిళ్ల పంపిణీ సమాచారం ఉపాధ్యాయులు తనకు తెలియజేయకపోవడంపై ఆ గ్రామ సర్పంచి బోయి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మానుకోవాలని, ప్రొటోకాల్ పాటించాలని హితవు పలికారు. ఈ విషయంపై పాఠశాల హెచ్.ఎం. నారాయణదాసును వివరణ కోరగా విద్యార్థినులకు అందజేసిన సైకిళ్లకు పార్టీ జెండాలు కట్ట వద్దని తాను వారించినా స్థానిక టీడీపీ నేతలు వినిపించుకోలేదన్నారు.- పిఠాపురం రూరల్
Advertisement