ప్రైవేటు బిల్లుకు మద్దతివ్వాలి
-
ఏపీ ప్రత్యేక హోదా విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ అంజయ్య
నెల్లూరు (టౌన్):
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న ప్రైవేటు బిల్లుకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని ఏపీ ప్రత్యేక హోదా విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ అంజయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక వీఆర్‌సీ సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వివిధ సంఘాల ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంజయ్య, లాయర్స్ అసోసియేషన్ నాయకుడు చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ పార్టీలకతీతంగా ఎంపీలందరూ ఒకే తాటిపైకి వచ్చి ప్రైవేటు బిల్లుకు మద్దతు తెలపాలన్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రైవేటు బిల్లును పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి మోదీని కలవనున్న చంద్రబాబు ప్రత్యేక హోదాపై డిమాండ్ చేయాలన్నారు. ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న పవన్‌కల్యాణ్ కనిపించకుండా పోయారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు నాగేంద్రకుమార్, వేణుగోపాల్, కొప్పుల చంద్రశేఖర్, రవి పాల్గొన్నారు.