స్వైన్ ఫ్లూ సైరన్
Published Thu, Jan 26 2017 1:45 AM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM
నిడదవోలు రూరల్: వాతావరణంలో మార్పులతో పాటు జిల్లాలో చలి తీవ్రంగా ఉండటంతో స్వైన్ ఫ్లూ భయం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లో స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో పాటు విశాఖలో ఈ వ్యాధితో ఇటీవల ఒకరు మృతిచెందడం, హైదరాబాద్ నుంచి జిల్లాకు ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగించడంతో వ్యాధి వ్యాప్తిపై అధికారుల్లో టెన్షన్ నెలకొంది. స్వైన్ ఫ్లూ ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి వైద్యారోగ్యశాఖ నుంచి ఆదేశాలు అందడంతో జిల్లాస్థాయిలో అధికారులు ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పించేందుకు సమయాత్తమయ్యారు. గురువారం నుంచి ప్రధాన సెంటర్ల వద్ద అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటుతో పాటు మురికివాడలు, గ్రామాల్లో వైద్యసిబ్బందితో కరపత్రాలు పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించారు. చలితీవ్రత ఎక్కువ ఉండటంతో జ్వరం, జలుబుతో పాటు స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆçస్పత్రుల్లో వైద్యసేవలు పొందాలని, మాస్క్‌లు వాడాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
జిల్లాలో ఏలూరు, తణుకు, భీమవరం ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేశామని అవసరమైతే ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేక గది కేటాయిస్తామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వి.కోటేశ్వరి తెలిపారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే రక్తనమూనాలను తిరుపతి కిమ్స్‌కు పంపించి వ్యాధి నిర్దారణ పరీక్షలు చేయిస్తామని చెప్పారు. వ్యాధిపై రెండురోజుల్లో వైద్య నివేదిక అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదుకాలేదని, ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
లక్షణాలు
జ్వరం, విపరీతమైన దగ్గు, తలనొప్పిగా ఉండటం, ముక్కు నుంచి జలుబు కారడం, గొంతు నొప్పి, కండరాల నొప్పి, అలసట చెంది నీరసంగా ఉండటం స్వైన్ ఫ్లూ లక్షణాలు.
జాగ్రత్తలిలా..
స్వైన్ ఫ్లూ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
చేతులను శుభ్రంగా కడగాలి. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు, ముక్కు నోటి దగ్గర చేతి రుమాలు, చేతిని అడ్డంగా పెట్టుకోవాలి.
ఎవరినైనా కలిసినప్పుడు కరచలానం, కౌగిలించుకోవడం,
ముద్దుపెట్టుకోవడం వంటివి
చేయకూడదు.
ఎవరికివారే చేతి రుమాలు
వాడాలి. శుభ్రం చేసుకోని
చేతులతో కళ్లు, ముక్కు, నోరును తాకకూడదు.
స్వైన్ ఫ్లూ సంబంధిత లక్షణాలు కనిపిస్తే స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలో తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి.
Advertisement
Advertisement