ఆ డీఈ కీచకుడే!
Published Sat, Jun 10 2017 10:50 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM
– మరిన్ని వెలుగులోకి వచ్చిన ఆపరేషన్స్ డీఈ రాసలీలలు
– సీఎస్‌సీ ఉద్యోగిని, ఆమె సోదరితోనూ అదే వ్యవహారం
– ఓ టెక్నికల్ ఏఈకీ తప్పని ఇబ్బదులు
– గతంలో పనిచేసిన డివిజన్‌లోనూ డ్రైవరు భార్యకు తప్పని వేధింపులు
– ఫలితంగా రూ.లక్షల వాహనం, ఆపరేటర్ పోస్టు నజరాన
– జ్వరం పేరుతో 3 రోజులు సెలవు కోరినట్లు సమాచారం
కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ శాఖ (ఎస్‌పీడీసీఎల్) డీఈ చీకటి కార్యకలాపాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అదే సంస్థలోని లారీ డ్రైవర్ భార్యతో డీఈ నడిపిన ‘చీకటి లీలలు’ పై ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పలువురు ఉద్యోగులు, బాధితులు మరిన్ని డీఈ లీలలను బయటకు తీసుకొచ్చారు. గతంలో ఆ డీఈ పనిచేసిన చోట్ల జరిపిన వ్యవహారాలను వివరిస్తున్నారు. కింది స్థాయి ఉద్యోగుల అవసరాలు, బలహీనతలను ఆసరా చేసుకొని లోబరుచుకోవడం ఆయనకు అలవాటుగా మారిందని ఆరోపిస్తున్నారు.
– మరిన్ని ఉదాహరణలు:
విద్యుత్ శాఖ ఓ ఆపరేషన్స్ డివిజన్ డీఈ చేపట్టిన రాస క్రీడలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఓ సీఎస్‌సీ సెంటర్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిణితో ఇదే తంతు కొనసాగించిన విషయం వెలుగులోకి వచ్చింది. అంతటితో ఆగని ఆయన ఆమె సోదరితోనూ ఆలాగే వ్యవహరించినట్లు సమాచారం. గతంలో ఇదంతా ప్రచారం జరగడంతో జిల్లా కేంద్రంలో పనిచేసే అధికారి విచారణ చేపట్టి సమస్య వ్యాపించకుండా అణిచివేసినట్లు ఆశాఖ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఇటు ఒక టెక్నికల్ విభాగంలో పనిచేసిన ఓ ఏఈకి సైతం ఇబ్బందులకు గురి చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో పనిచేసిన డివిజన్‌లో ఈయన చేసిన ఘనకార్యం ఇంతా అంత కాదు. అక్కడ కూడా డ్రైవర్ భార్యతో సన్నిహితంగా ఉన్న కారణంగా రూ.4లక్షలు వెచ్చించి మూడు టన్నుల వాహనం కొనుగోలు చేసి బహుమానంగా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వాహనం ప్రస్తుతం సంస్థకే అద్దె ప్రతిపాదికన నడుస్తోంది. దీంతోపాటు ఓ ఆపరేటర్ పోస్టును కూడా నజరానా ఇచ్చినట్లు సమాచారం.
– గతంలో పని చేసిన చోట్ల ఆరోపణలే:
ఆ కరెంటు డీఈ గతంలో పనిచేసిన చోట్లలో కూడా ఇలాంటి ఆరోపణలు భారీగా ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. కర్నూలు చుట్టు పక్కన ఉన్న జిల్లాలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. అక్కడ రాసలీలలు, మామూళ్ల దంద నడపడం, వివిధ కాంట్రాక్టు పోస్టులు అమ్ముకోవడం, మామూళ్లు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడం అంతా ఆయన ఖాతాలోనే ఉన్నట్లు సమాచారం.
– జ్వరం పేరుతో సెలవులోకి...
వ్యవహారం అంతా బయటకు పొక్కి పోలీసు, కేసుల దాక వెళ్లడం, సాక్షిలో ఆయన చీకటిలీలలపై కథనం ప్రచురితం కావడంతో ఆ డీఈకి జర్వం వచ్చినట్లు ఉంది. ‘సాక్షి’ పత్రికలో కథనం చూసిన మరుక్షణమే తనకు జ్వరం వచ్చిందని, మూడు రోజులు సెలవుపై వెళ్తున్నట్లు పై అధికారులకు మెసేజ్ పెట్టినట్లు సమాచారం.
– ఎస్‌పీకి ఫిర్యాదు చేసిన డ్రైవర్?
తనకు చేసిన అన్యాయం పట్ల ఆ డ్రైవర్ జిల్లా ఎస్‌పీ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఆ డీఈ తన భార్య పట్ల అసభ్యకంగా వ్యవహరించడంతోపాటు ఆమెతో కేసు పెట్టించి అరెస్టు చేయించారని, ఆ డీఈపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి న్యాయం చేయాలని విన్నవించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కేసును రాజీ చేసుకునేందుకు బాధితులు, అటు స్థానిక పోలీసులతో తీవ్ర స్థాయిలో యత్నిస్తున్నట్లు విద్యుత్ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
Advertisement
Advertisement