► అమ్ముడుపోయావంటూ దిష్టిబొమ్మ దహనం
► ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్
కదిరి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా టీడీపీలో చేరడంపై శనివారం స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ముస్లిం మైనార్టీ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. 'ఎన్నికల్లో ఆ రోజు మేము నిన్ను చూసి ఓట్లు వేయలేదు. వైఎస్సార్ కుటుంబాన్ని చూసి నిన్ను గెలిపించుకున్నాం. నీకు ఏమాత్రమూ సిగ్గు..లజ్జ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ తరఫున పోటీచేసి గెలువు. కదిరికి వస్తే చొక్కా పట్టుకొని నిలదీస్తాం' అని మైనార్టీలు హెచ్చరించారు. కదిరి పట్టణంలో నిరసనకారులు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ కూడలిలో ఎమ్మెల్యేకు చెందిన అత్తార్ రెసిడెన్సీ ఎదుట చాంద్‌బాషా దిష్టిబొమ్మను దహనం చేశారు.
ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే మక్కాకు పలుమార్లు వెళ్లొచ్చి, హాజీగా పేరు గడించి, ఓట్లేసి గెలిపించిన ప్రజలను మోసగించడం సరికాదని మండిపడ్డారు. మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఓట్లు వేయొద్దని చెప్పి ఇప్పుడు అదే పార్టీలోకి ఎలా వెళ్లావని ప్రశ్నించారు. ముస్లిం మైనార్టీల ద్రోహి..అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు బాబా, జిలాన్, అల్లాబక్ష్, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు జక్కల ఆదిశేషు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్‌రెడ్డి, లీగల్‌సెల్ రాష్ట్ర నేత లింగాల లోకేశ్వర్‌రెడ్డి, ఎన్‌పీకుంట సింగిల్‌విండో అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, రైతువిభాగం జిల్లా నాయకులు కుర్లి శివారెడ్డి, గాండ్లపెంట మండల కన్వీనర్ పోరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, యువజన విభాగం నాయకులు సలీం, ఉపేంద్రశీనా, నాగేంద్ర, కోటి, ఎస్సీ సెల్ నాయకులు రాంప్రసాద్, విద్యార్థి విభాగం నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు.
చాంద్‌బాషాపై మైనారిటీల ఆగ్రహం
Published Sat, Apr 23 2016 10:09 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM
Advertisement
Advertisement