ఆబ్కారీ కుర్చీలకు ఇక కదలిక
సిద్ధమైన ఉద్యోగుల బదిలీల ఫైల్
సీఎం ఆమోదముద్రే తరువాయి
మూడేళ్లు సర్వీస్ దాటిన ఎక్సైజ్ అధికారులకు స్థానచలనం
ఆరేళ్లు ఒకే జిల్లాలో పనిచేసిన వారికి జిల్లాల మార్పు తప్పనిసరి
సమస్యాత్మక స్టేషన్లలో పనిచేసిన వారు తప్పనిసరిగా ఎ- కేట గిరీలోకి
సాక్షి, హైదరాబాద్: ఆబ్కారీ శాఖలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. నాలుగేళ్ల విరామం తరువాత కానిస్టేబుళ్లు మొదలుకొని డిప్యూటీ కమిషనర్ల వరకు స్థానచలనం చేసేందుకు ఉద్దేశించిన ఫైలు సీఎం టేబుల్ మీదికి చేరింది. బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ ఆయన సంతకం చేసిన మరు నిమిషమే సుమారు 1700 ఉద్యోగుల సీట్లు మారనున్నాయి. ఎక్సైజ్ శాఖ రూపొందించిన విధివిధానాల మేరకు ప్రభుత్వం జిల్లాల వారీగా బదిలీల ప్రక్రియ చేపట్టనుంది. ఈనె లాఖరులో ముహూర్తం ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
బదిలీల గురించి ఉద్యోగ, అధికారుల సంఘాలు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా, రాష్ట్ర విభజన, ఉద్యోగుల కేటాయింపు తదితర కారణాలతో ముందుకు కదలలేదు. కమలనాథన్ కమిటీ ఎక్సైజ్ శాఖలో విభజన ప్రక్రియ పూర్తిచేసిన నేపథ్యంలో బదిలీల ఫైలుకు మోక్షం లభిస్తోంది. ఈ మేరకు మార్గదర్శకాలను కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి రూపొందించారు. వాటికి ఇటీవలే మంత్రి పద్మారావు గౌడ్ ఆమోదం లభించింది. మంత్రి నుంచి ఫైలు సీఎం కార్యాలయానికి చేరింది. వరంగల్ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ 24తో పూర్తవుతున్న నేపథ్యంలో ఈనెలాఖరులోగా కేసీఆర్ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ సంతకం చేసే అవకాశం ఉంది.
భారీగా స్థాన చలనాలు
ఎక్సైజ్ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్ స్థాయిలో 1200మంది వరకు విధుల్లో ఉండగా, ఎస్‌ఐ నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయిలో సుమారు 500 మంది ఉన్నా రు. వీరంతా గత నాలుగేళ్లుగా బదిలీలకు నోచుకోలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం డిసెంబర్ నెలను కటాఫ్‌గా నిర్ణయించి అప్పటికి ఆయా స్థానాల్లో మూడేళ్లు సర్వీస్ పూర్తయిన వారిని బదిలీల కేటగిరీలోకి తీసుకోనున్నారు. ఈలెక్కన దాదాపు 80 శాతానికి పైగా ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశం ఉంది.
ఆరేళ్లు పనిచేస్తే స్థానభ్రంశం
బదిలీల విధానంలో కొన్ని మార్పులు కూడా తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎస్‌ఐ నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు జరిగే బదిలీలకు సంబంధించి ఒకే జిల్లాలో ఆరేళ్లుగా పనిచేసినా లేదా ఒకే జిల్లాలో మూడు సార్లు బదిలీలు జరిగిన అధికారులను వేరే జిల్లాకు మార్చనున్నారు. స్థానికతకు కూడా ప్రాధాన్యమిస్తూ లోకల్ యూనిట్‌లో అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించారు. అలాగే ఎ,బి,సి కేటగిరీ స్టేషన్లలో పనిచేస్తున్న వారికి కూడా వాటిని మార్చాలని నిర్ణయించారు. ధూల్‌పేట, చార్మినార్ వంటి స్టేషన్లతో పాటు చెక్‌పోస్టులు, బోర్డర్ మొబైల్ పార్టీలు వంటి సి-కేటగిరీలో పనిచేస్తున్న వారికి ఎలాంటి అడ్డంకులు కల్పిం చకుండా ఎ-కేటగిరీ స్టేషన్లు(కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాలు) కేటాయించనున్నారు. అలాగే బదిలీల్లో రెవెన్యూ అధికంగా సాధించి పెట్టిన స్టేషన్ అధికారికి ఏ కేటగిరీ స్టేషన్‌ను కేటాయించడం, తరువాత స్థానాల్లో ఉన్న వారికి బి, సి కేటగిరీలకు పంపడం ఆనవాయితీగా వస్తోం ది. ఈసారి రెవెన్యూతో పాటు గుడుంబా, అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టిన వారికి కూడా ప్రాధాన్యమివ్వాలని కూడా విధివిధానాల్లో పొందుపరిచినట్లు సమాచారం.
సీఎంకు నెగిటివ్ రిపోర్ట్
ఆబ్కారీ శాఖ బదిలీల్లో రూ.లక్షల్లో చేతులు మారుతాయని, కోరిన పోస్టింగ్ కోసం ఎస్.ఐ. నుంచి డిప్యూటీ కమిషనర్ల వరకు భారీ ఎత్తున సమర్పించుకుంటారని ముఖ్యమంత్రికి ఇప్పటికే ఉప్పందింది. గతంలో ఎస్‌ఐ, సీఐ, ఏఈఎస్, ఈఎస్, ఏసీ పోస్టులకు వేర్వేరుగా ధరలు నిర్ణయించి బదిలీలు జరిపినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎంను ఉద్యో గ సంఘాల నేతలు కలిసి బదిలీల ఊసెత్తినప్పుడు చూద్దాం, చేద్దాం అనే రీతిలో సమాధానాలు చెప్పినట్లు సమాచారం. నాలుగేళ్లుగా బదిలీలు జరగలేదని, పారదర్శకంగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తామని ఇటీవల సీఎంను కలిసిన ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావుగౌడ్ చెప్పడంతో ఆయనఒప్పుకున్నట్లు తెలిసింది.