
దూరం.. భారం..
► కొత్త జిల్లా ఏర్పాటవుతున్నా పలువురికి ప్రయోజనం శూన్యం
► జిల్లా కేంద్రానికైనా.. రాజధానికైనా దాదాపు అంతే దూరం..
‘పరిపాలన సౌలభ్యం.. ప్రజలకు సౌకర్యం.. లక్ష్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు ఉండాలి.. దూరభారం తగ్గించాలి.. 65 కి.మీల లోపు జిల్లా కేంద్రం ఉండేలా కొత్త జిల్లాల ఏర్పాటు ఉండాలి..’ ఇవీ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన మార్గదర్శకాలు.
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కొత్తగా కొమురంభీం(మంచిర్యాల) జిల్లా ఏర్పాటు చేస్తున్నా.. సీఎం లక్ష్యం నెరవేరడం లేదు. ఆచరణకు వచ్చే సరికి పలు మండలాలకు అది సాధ్యం కావడంలేదు. కొత్త జిల్లా ఏర్పాటుతో కూడా జిల్లాలో పలు మండలాల ప్రజలకు దూరభారంలో మార్పు లేకుండా పోయింది. వీరు జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే ఏకంగా సుమారు 170 కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి రానున్న రోజుల్లో కూడా కొనసాగనుంది. వీరు జిల్లా కేంద్రానికి వెళ్లినా.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వెళ్లినా దాదాపు సమాన దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొందంటే ఆదిలాబాద్ జిల్లాలో భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. ఇది ఏ ఒక్క సరిహద్దు చివరి గ్రామానికో పరిమితం కాలేదు. దాదాపు నియోజకవర్గం గ్రామాలన్నింటికీ కొత్త జిల్లా దూరభారం తగ్గడం లేదు.
హైదరాబాద్‌కు తొందరగా వెళ్లవచ్చు..
దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం జ్ఞాన సరస్వతీ అమ్మవారు కొలువై ఉన్న బాసర గ్రామ ప్రజలు జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే 155 కి.మీలు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇదే బాసర నుంచి హైదరాబాద్ చేరుకోవాలంటే కూడా 180 కి.మీలు మాత్రమే. ఆదిలాబాద్ కంటే హైదరాబాద్‌కు త్వరగా చేరుకోగలుగుతారు. అయితే.. కొత్త జిల్లా ఏర్పాటు చేసినప్పటికీ ఈ దూరభారంలో ఎలాంటి మార్పులు లేకపోవడం గమనార్హం. అలాగే కుభీర్ మండలం సరిహద్దు గ్రామాలైన దొడర్న, నిగ్వా, సావ్లీ వంటి గ్రామాల ప్రజలు కూడా ఆదిలాబాద్‌కు చేరుకోవాలన్నా.. దాదాపు 150 కి.మీలు ప్రయాణం చేయాల్సి వస్తోంది.
ఇలా నియోజకవర్గంలో ముథోల్, కుభీర్ వంటి మండలాల పరిధిలో పలు గ్రామాల ప్రజలకు దూరభారం తగ్గడం లేదు. దీంతో ఈ ప్రాంత ప్రజలు వివిధ పనుల నిమిత్తం జిల్లాకేంద్రానికి చేరుకోవాలంటే అనేక ఇబ్బందులు పడాల్సిందే. వెళ్లి రావాలంటే మూడు వందల కిలో మీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా నిర్మల్‌ను జిల్లా చేయని పక్షంలో తమను నిజామాబాద్ జిల్లాలోనైనా కలపాలని కుభీర్ మండలం చాత గ్రామస్తులు ఇటీవల తీర్మానం చేశారు. అయితే నిజామాబాద్ జిల్లాలో విలీనం చేయడానికి జోన్ల సమస్య ఎదురవుతుందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.
సగానికి తగ్గినా దూరమే..
మంచిర్యాలను జిల్లా చేయడంతో కాగజ్‌నగర్ ప్రాంతంలోని పలు మండలాల వాసులకు దూరభారం చాలామట్టుకు తగ్గుతుంది. అయినప్పటికీ కొన్ని గ్రామాల వాసులకు జిల్లా కేంద్రం 140 కిలో మీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితే నెలకొంటుంది. ఉదాహరణకు బెజ్జూరు మండల కేంద్రం నుంచి మంచిర్యాలకు రావాలంటే కనీసం 130 కిలో మీటర్లు ప్రయాణించాల్సిందే.
ఈ మండలంలోని సరిహద్దు గ్రామాల వాసులకైతే అదనంగా మరో పది కిలో మీటర్ల దూరం ఉంటుంది. ప్రభుత్వం మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేయకపోతే ఈ మండలాల వాసులు ఏకంగా 200 కిలో మీటర్లకు పైగా దూరం ప్రయాణంచి జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ చేరుకుంటున్నారు. ఈ ప్రాంత వాసులకు మాత్రం కొంత ఊరట లభిస్తోంది.