
భక్తులపై భారం లేనట్టే
►నేటితో ముగియనున్న టీటీడీ ధర్మకర్తల మండలి పదవీకాలం
►పోటు కార్మికులకు వెసులుబాటు కల్పించిన ఆఖరి సమావేశం
►దీర్ఘకాలిక బంగారం డిపాజిట్లతో శ్రీవారికి రాబడి
తిరుమల: హమ్మయ్యా..! భక్తులపై భారం లేనట్టే. ధరల పెంపుపై ఎలాంటి ప్రస్తావన లేకుండా టీటీడీ ధర్మకర్తల మండలి ఆఖరి సమావేశం ముగిసింది.
భారం పడినా..!
శ్రీవారి లడ్డూ తయారుచేయడానికి టీటీడీకి రూ.35 ఖర్చు అవుతోంది. అయితే, లడ్డూ ధర మాత్రం రూ.25 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతోపాటు సబ్సిడీ ధరతో రూ.10 చొప్పున సర్వదర్శనం, కాలిబాట భక్తులు ఒకరికి రెండు చొప్పున విక్రయిస్తున్నారు. కాలిబాట భక్తులకు మరొకటి ఉచితంగా అందిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో రోజూ తయారుచేసే 3 లక్షల లడ్డూల్లో సగభాగం సబ్సిడీ, ఉచిత లడ్డూల కింద భక్తులకు అందజేస్తున్నారు. దీనివల్ల టీటీడీపై భారం పడుతోంది. తయారీ ధరలో రూ.10తోపాటు సబ్సిడీ ధరలో ధార్మిక సంస్థపై భారం పడుతోందని ఆర్థిక నిపుణులు లెక్క తేల్చారు.
దీంతోపాటు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు కూడా పదేళ్ల నుంచి ఒకే ధరలు అనుసరిస్తున్నారు. ఇక కాటేజీలు, కల్యాణ మండపాల నిర్వహణ భారం పెరిగింది. దీంతో అన్ని విభాగాల్లోనూ ధరలు పెంచాలని ప్రస్తుత బోర్డు సంకల్పించింది. దీనిపై రెండేళ్ల నుంచి ప్రతి సమావేశంలో చర్చించింది. సబ్‌కమిటీలు వేసింది. నివేదికలు కూడా ధరలు పెంచాలనే సానుకూలంగా వచ్చాయి. అయినా వాటి జోలికి వెళ్లకుండానే ప్రస్తుత ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారంతో పూర్తి చేసుకుంది.
పోటుకార్మికులకు వెసులుబాటు
శ్రీవారి ఆలయంలోని ప్రధాన పోటు, అదనపు పోటులో మొత్తం 492 మంది పోటు కార్మికులు సేవలందిస్తున్నారు. లడ్డూ ప్రసాదంతోపాటు అన్నప్రసాదాలు తయారు చేస్తుంటారు. ఒకరికి నెల రూ.17వేలు పైచిలుకు జీతం లభిస్తోంది. వీరి నేతృత్వంలోనే రోజూ 3లక్షల లడ్డూలు తయారు చేస్తూ భక్తులకు కనీస లడ్డూలు అందేలా సేవలందిస్తున్నారు. వీరి సేవల్ని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు. ఇందులో భాగంగా మరో రూ.3 వేల చొప్పున వేతనాలు పెంచాలని సిఫారసు చేశారు. ఇందుకు బోర్డు కూడా ఆమోదం తెలిపింది. దీంతోపాటు పోటు కార్మికులకు టీటీడీ ఉద్యోగుల తరహాలోనే సుపథం క్యూ మార్గం నుంచి శ్రీవారి దర్శనం, టీటీడీ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సదుపాయం కల్పించారు. దీంతో ఆ పోటు కార్మికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
దీర్ఘకాలిక పెట్టుబడుల్లోకి శ్రీవారి బంగారం
తిరుమలేశునికి భక్తులు నగదు, బంగారం, వెండి, ఇతర విలువైన రంగురాళ్లు.. వివిధ రూపాల్లో మొక్కులు చెల్లిస్తుంటారు. ఇలా లభించిన బంగారం సుమారు 7వేల కిలోలు మూడు జాతీయ బ్యాంకుల్లో కార్పస్ కింద డిపాజిట్ చేశారు. ప్రస్తుతం ఈ బంగారం డిపాజిట్లు 3 సంవత్సరాల కాలపరిమితి లోబడి స్వల్ప కాలిక డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. వీటిపై సాలీనా కేవలం 1శాతం మాత్రమే వడ్డీ లభిస్తోంది. 12 సంవత్సరాలకు ఒకేసారి డిపాజిట్ చేయటం వల్ల 2.5 శాతం వడ్డీ లభిస్తున్నట్టు ఆర్థిక నిపుణులు లెక్కలు తేల్చారు. దీనివల్ల ధార్మిక సంస్థకు రాబడి పెరిగే అవకాశం ఉంది. దీంతో స్వల్పకాలిక డిపాజిట్లను రద్దు చేసి, దీర్ఘకాలిక డిపాజిట్ల రూపంలో చేయాలని బోర్డు ఆమోదం తెలిపింది.
బోర్డు సభ్యులకు పోతన భాగవతం బహూకరణ
టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్‌తోపాటు సభ్యులందరికీ పోతన భాగవతం గ్రంథాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా రెండేళ్లపాటు ధర్మకర్తల మండలి సేవల్ని టీటీడీ ఈవో సాంబశివరావు కొనియాడుతూ, ప్రత్యేకంగా అభినందలు తెలిపారు.