దోపిడీ దొంగల దాష్టీకం..
హైదరాబాద్ : ఓ ఇంటిని దోచుకునేందుకు వచ్చిన ఇద్దరు దొంగలు సొమ్ముతో పాటు ఓ బాలికను నోట్లో గుడ్డలు కుక్కి ఎత్తుకెళ్లిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నార్సింగి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కోకాపేట్ ప్రాంతంలోని గూంచా హిల్స్‌లో నివసిస్తున్న ఐటీ ఉద్యోగి మనోజ్‌రెడ్డి ఇళ్లు కట్టుకుంటూ, సమీపంలో మరో ఇంట్లో భార్య జ్యోతి, కూతురు, తన మరదలి కూతురు, పని మనిషితో సహా నివసిస్తున్నాడు. శుక్రవారం రాత్రి మనోజ్, తన భార్య కుమార్తెలతో కలిసి బెడ్‌రూమ్‌లో నిద్రపోతుండగా, మరదలి కూతురు (11), మరో బాలికతో కలిసి వరండాలో పడుకుంది.
శనివారం తెల్లవారు జామున నిచ్చెన సహాయంతో బాల్కానీలోకి ప్రవేశించిన ఇద్దరు దొంగలు హాల్‌లో ఉన్న రెండు ఆపిల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, బంగారు గొలుసును దొంగలించారు. అదే సమయంలో బాలిక మేలుకుని అరవడానికి యత్నించగా, వారు ఆమె నోట్లో గుడ్డలు కుక్కి మెయిన్ గేటు వరకు తీసుకెళ్లి పారిపోయారు. దీంతో భయాందోళనకు గురైన బాలిక గేటు పక్కనే గదిలో నిద్రిస్తున్న వాచ్‌మెన్‌ను లేపి విషయం చెప్పడంతో అతను మనోజ్‌కుమార్ సమాచారం అందించగా, వారు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ సంఘటనా పరిశీలించి వివరాలు సేకరించారు. బాలికపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారేమోనన్న అనుమానంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలిసిన వారి పనేనా...
గూంచా హిల్స్ గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ ప్రహరీ, గేటు, వాచ్‌మేన్ ఉడటంతో నిందితులు గోడ దూకి లోనికి ఎలా ప్రవేశించారు. మనోజ్ రెడ్డి ఇంటి మొదటి అంతస్తు బాల్కానీలోకి ఎలా వెళ్లారు అన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. బాలిక చెబుతున్న వివరాలను బట్టి తెలిసినవారే దోపిడీకి పాల్పడి ఉండవచ్చునన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.
డాగ్ స్క్వాడ్ తనిఖీలు
పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్కాడ్ సిబ్బందికి సమాచారం అందించడంతో డాగ్ స్కాడ్ గండిపేట్ ఎక్స్‌రోడ్డు వరకు వెళ్ళి తిరిగి వచ్చాయి. నిందితులు కాలినడకన చౌరస్తా వరకు వెళ్ళి ఏదైనా వాహనం ఎక్కి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రహదారిపై ఉన్న సీసీ టీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు.