చెన్నై ఆస్పత్రిలో నగరి చైర్‌పర్సన్‌కు వైద్యం
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్, ఎమ్మెల్యే రోజా ఫోన్‌లో పరామర్శ
సాక్షి ప్రతినిధి, చెన్నై : తెలుగుదేశం పార్టీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్‌సీపీకి చెందిన చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ చైర్‌పర్సన్ కె.శాంతకుమారికి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. వైద్య పరీక్షల నివేదికలు వచ్చాక ఆమె ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు. నగరిలో ఆదివారం రంజాన్ తోఫా కార్యక్రమానికి వెళ్లిన ఆమెపై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడి సమక్షంలో ఆ పార్టీ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారు ఆమె కడుపుపై మోకాలితో తన్నడంతో స్పృహ తప్పి పడిపోయారు.
వెంటనే తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం సోమవారం చెన్నైకి తీసుకువచ్చారు. శాంతకుమారి భర్త, నగరి మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 4వ తేదీన చెన్నై అపోలో ఆసుపత్రిలో ఆమె కడుపునకు ఆపరేషన్ చేశారన్నారు. ఆరు నెలల పాటు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించిన తరుణంలో పుండు మానక ముందే ఎమ్మెల్సీ గాలి అనుచరులు అమృతరాజ్, అతని తమ్ముడు మైఖేల్‌రాజ్, బాల, మునికృష్ణారెడ్డి తదితరులు మోకాళ్లతో తన్నారన్నారు. గతంలో ఆపరేషన్ చేసిన వైద్యులే ఇపుడు శాంతకుమారికి పరీక్షలు నిర్వహించారని, రిపోర్ట్ వచ్చాకే పరిస్థితి ఏమిటనేది తెలుస్తుందన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.. శాంతకుమారిని ఫోన్‌లో పరామర్శించారని చెప్పారు.