అమెరికాలో పెరిగిన గన్ సంస్కృతి
ట్రంప్ వ్యాఖ్యల కారణంగానే భారతీయులపై దాడులు
అమెరికాలోని తెలుగువారికి రక్షణ కల్పించాలి
పట్టించుకోని మోదీ సర్కార్
భారత ప్రతినిధిని పంపించాలని కాంగ్రెస్ నేత వీహెచ్ డిమాండ్
సిద్దిపేట అర్బన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనాలోచిత నిర్ణయాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యల మూలంగానే అక్కడి భారతీయులపై దాడులు జరగుతున్నాయని మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు అన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో గన్ సంస్కృతిని పెరిగి పోయిందన్నారు. ఆదివారం సిద్దిపేట మండలం పొన్నాల దాబాల వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముంబయి ఎన్నికల్లో ఏదో సాధించినట్లు గంతులేస్తున్న వెంకయ్య నాయుడికి అమెరికాలోని తెలుగువారు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
నోట్ల రద్దు గొప్పలు చెప్పుకునే ప్రధాని మోదీ∙ఎందుకు పట్టించుకోడన్నారు. ఇంట్లోనే ఉండాలి.. తెలుగు మాట్లాడకూడని పరిస్థితుల్లో తెలుగువారు యూఎస్‌లో ఉన్నారంటే వారు ఎంత భయాందోళనలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. అమెరికాలోని భారత విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకుంటున్న వారి తల్లిదండ్రులు ఇక్కడ ఎంతో ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయులపై దాడుల నేపథ్యంలో భారత ప్రతినిధులను అమెరికాకు పంపించి అక్కడి భారతీయులకు రక్షణ కల్పించాలన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంలో చొరవ తీసుకుని ప్రధాని మోదీని కలిసి యూఎస్‌లోని తెలుగువారికి రక్షణ కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. అమెరికాలోని విదేశీయులు ప్రశాతంగా జీవించేందుకు అన్ని దేశాల ప్రతినిధులు సహకరించాలని కోరారు.
కేసీఆర్ సంస్కృతి నేర్చుకో..
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతుండడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఇంకా దొరలెక్క మాట్లాడితే ఎలా సంస్కృతి నేర్చుకోవాలని సీఎం కేసీఆర్‌కు సూచించారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ను మార్చే ఆలోచనను విరమించుకోవాలన్నారు. ఒక్క నిరుద్యోగ ర్యాలీకే పరేషాన్ అవుతున్న కేసీఆర్‌కు ముందు ముందు అనేక సమస్యలు ఎదురవుతాయని చెప్పారు. హామీలను మరిచిన కేసీఆర్‌వి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అనేది ప్రజలకు అర్థమయిందని, 2019 ఎన్నికల్లో ఎవరేమిటనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు. సమావేశంలో పీసీసీ కార్యవర్గ సభ్యులు గంప మహేందర్‌రావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరసు ప్రభాకరవర్మ, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు అక్బర్, నాయకులు వహీద్‌ఖాన్, దాస అంజయ్య, కలీం, షాబొద్దిన్, అత్తు తదితరులు పాల్గొన్నారు.