టీకాలు వేయడం తప్పనిసరి
Published Sat, Jul 30 2016 7:34 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అదనపు సంచాలకురాలు డాక్టర్ నీరద
గుంటూరు మెడికల్: జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తప్పనిసరిగా ప్రతి బుధవారం టీకాలు వేయాలని, టీకాల కోసం వచ్చే వారిని ఏఎన్‌ఎంల కోసం వేచి ఉంచకుండా ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సులు తక్షణమే టీకాలు వేయించి పంపాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు సంచాలకులు డాక్టర్ నీరద అన్నారు. గుంటూరు వైద్యకళాశాలలో ఇమ్యూనైజేషన్ కార్యక్రమంపై శనివారం జిల్లా స్థాయి వర్క్‌షాపు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డాక్టర్ నీరద మాట్లాడుతూ జిల్లాలో ఇమ్యూనైజేషన్ కార్యక్రమం పగడ్బందీగా అమలు జరిగేలా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రతి బుధవారం టీకాలు వేయబడునని అందరికి కనిపించేలా ఆరోగ్య కేంద్రాల్లో బోర్డులు రాయించాలని ఆదేశించారు. బుధవారం, శనివారం టీకాలు వేసేందుకు ఏఎన్‌ఎంలు వెళ్లే సమయంలో టీకాలను ఎలా నిల్వచేస్తున్నారు, ఏయే టీకాలు తీసుకెళ్తున్నారనే విషయాలను తప్పనిసరిగా వైద్యాధికారులు తనిఖీ చేయాలన్నారు. మంగళవారం, శుక్రవారం టీకాల కార్యక్రమం సర్వే చేయాలని, గుంటూరు జిల్లాలో సర్వే సక్రమంగా ఎందుకు జరగటం లేదని వైద్యాధికారులను ప్రశ్నించారు.
ఆగస్టు ఒకటి నుంచి బయోమెట్రిక్ హాజరు...
జిల్లా వ్యాప్తంగా ఆగస్టు ఒకటోతేదీ నుంచి బయోమెట్రిక్ హాజరు అమలులోకి వస్తుందని, బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే జీతాలను విడుదల చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి చెప్పారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదేశాల మేరకు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. ఓపీకి వస్తున్న రోగుల్లో 15శాతానికి మించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు రాయవద్దని, అంతకు మించి రాస్తే ఉన్నతాధికారులకు వివరణ ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు అనంతరం తల్లి, బిడ్డను తప్పనిసరిగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనంలోనే ఇంటికి తీసుకెళ్ళాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెంచేలా ప్రతి ఒక్కరు కషి చేయాలని అన్నారు. ప్రతిరోజూ సాయంత్రం నాలుగు గంటల కల్లా ఎన్ని డెలివరీలు ఆస్పత్రిలో జరిగాయో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి నివేదిక అందజేయాలన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఏ టీకాలు ఏయే సమయాల్లో వేయాలో వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోగ్రామ్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement