ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముంది? | veldurthi krupamani suicide case: police seize pendrive | Sakshi
Sakshi News home page

ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముంది?

Published Tue, Oct 27 2015 6:59 PM | Last Updated on Sun, Sep 3 2017 11:34 AM

ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముంది?

ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముంది?

సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేల్పూరుకు చెందిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసులో పోలీసులకు రోజుకొక కీలక సమాచారం లభ్యమవుతోంది. తణుకుకు చెందిన గుడాల సాయిశ్రీనివాస్ తనను వ్యభిచారం చేయాలని వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని కృపామణి సెల్ఫీ ద్వారా సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

అదనపు డీజీ ఠాకూర్ స్వయంగా రంగంలోకి దిగడంతో ఎస్పీ భాస్కర్ భూషణ్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సాయి శ్రీనివాస్ ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు పెన్ డ్రైవ్ దొరికినట్టు తెలిసింది. ఆ పెన్ డ్రైవ్‌లో వందమందికి పైగా యువతులు, మహిళలతో రాసలీలల దృశ్యాలు ఉన్నట్టు సమాచారం. తనతో సన్నిహితంగా ఉండే మహిళల చిత్రాలను షూట్‌చేసి బ్లాక్‌మెయిల్ చేసేవాడని ఇప్పటికే సాయిశ్రీనివాస్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఇదే నేపథ్యంపై ఇతనిపై పెరవలి, హైదరాబాద్ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి.

వాస్తవానికి ఈ కీచకుడి విశృంఖలత్వం వెనుక ఖాకీల పాత్ర కూడా ఉందని అంటున్నారు. తణుకుకు చెందిన కొంతమంది పోలీసులు సహకరించడం వల్లనే నిందితుడు నిర్భీతిగా దుశ్చర్యలకు పాల్పడ్డాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మూడు ప్రత్యేక బృందాలు సాయిశ్రీనివాస్ వేటలో ఉన్నాయి. నిందితుడు పట్టుబడితే పోలీసు శాఖలోని ఇంటిదొంగల గుట్టు బయటపడే అవకాశముంది.

కేసులో సెల్ఫీయే కీలకం
తణుకు: కృపామణి ఆత్మహత్య కేసులో రెండున్నర నిమిషాల సెల్ఫీ వీడియో కీలకంగా మారింది. ఆమె సెల్ఫీ తీసుకుందా, ఎవరైనా సహకరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పాత మోడల్ సెల్‌ఫోన్ వెనుక ఉన్న కెమెరాతో సెల్ఫీ తీసుకోవడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శ్రీనివాస్ బావ, సోదరి విచారణ!
ఈ కేసులో ప్రధాన నిందితుడు గుడాల సాయిశ్రీనివాస్  కోసం పోలీసులు గాలిస్తున్నారు. తణుకులోని అతని ఇంటికి తాళం వేసి ఉండటంతో హైదరాబాదులో ఉంటున్న అతని సోదరి, బావలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. శ్రీనివాస్‌కు చెందిన రెండు కార్లు, బైక్, ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.

ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో తణుకు సీఐ, రూరల్ ఎసై్సపై పోలీసు ఉన్నతాధికారులు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement