
కృపామణి కేసులో కొత్త కోణాలు
తణుకు(పశ్చిమగోదావరి జిల్లా): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేల్పూరుకు చెందిన వివాహిత వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కృపామణి కేసును విచారించేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఘటన వెలుగులోకి వచ్చి ఐదు రోజులైనా నిందితులు దొరకలేదు. ఫోన్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు కష్టపడాల్సి వస్తోంది.
కాగా, ఈ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితుడు సాయిశ్రీనివాస్ కు అధికారులు, రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో పలువురు యువతులు, మహిళలను లైంగికంగా వేధించినట్టు సమాచారం.
మరోవైపు నిందితులను పట్టుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలను నియమించగా, ఇప్పుడు రాష్ట్ర అదనపు డీజీ ఆర్‌పీ ఠాకూర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం తణుకు మండలం వేల్పూరులో కృపామణి భర్త నాగపవన్‌కుమార్ ఇంటికి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులనుంచి వివరాలు సేకరించారు.
తణుకుకు చెందిన గుడాల సాయిశ్రీనివాస్‌తో పాటు కృపారాణి తల్లిదండ్రులు, సోదరుడు తనను వ్యభిచారం చేయాలని తీవ్రంగా వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని కృపామణి సెల్ఫీ ద్వారా సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి కాలువలో పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఎస్పీ భాస్కర్‌భూషణ్ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు.
పోలీసుల విస్తృత గాలింపు
ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న సాయిశ్రీనివాస్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇతను పలువురు మహిళలు, యువతులను వలలో వేసుకుని బ్లాక్ మెయిల్ చేసేవాడని పోలీసులు చెబుతున్నారు. పెరవలి పోలీసుస్టేషన్‌లో ఓ కేసులో ఇతను నిందితుడు. హైదరాబాదులో కూడా ఓ యువతిని గదిలో నిర్బంధించి అత్యాచారం చేసిన అభియోగంపైనా ఇతనిపై కేసు నమోదైనట్టు తెలిసింది. మృతురాలి తల్లిదండ్రులు, సోదరుడి కోసం కూడా గాలిస్తున్నారు.