ఫ్లేవరేట్.. చాక్లెట్
నగరంలో నయామాల్
రకరకాల ఆకృతుల్లో తయారీ ∙
ఫేస్‌బుక్, ఫోన్ ద్వాకా బుకింగ్..
కొరియర్ ద్వారా విదేశాలకు ఎగుమతి
నగరంలో సరికొత్త ట్రెండ్
చాక్లెట్ల తయారీలో రాణిస్తున్న వరంగల్ వాసి సుప్రియ
చిన్నపిల్లలు మారాం చేస్తే చాక్లెట్.. సంతోషంలో అదే పిల్లలకు ఇవ్వాలన్నా చాక్లెట్.. పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఇలా చెప్పుకుంటూ పోతూ వేడుక ఏదైనా అప్పటికప్పుడు నోరు తీపి చేయాలంటే గుర్తుకొచ్చేది చాక్లెట్టే! కొన్నేళ్ల క్రితం ఆశ, న్యూ్రట్రిన్.. ఆపై కాడ్బరీస్.. కొన్నాళ్లకు మరికొన్ని కంపెనీల చాక్లెట్లు మార్కెట్‌కు వచ్చాయి. కానీ అవి కంపెనీ నుంచి వచ్చిన రూపంలోనే ఉంటాయి. మనకు కావాల్సినట్లు కావాలంటే సాధ్యం కాని పరిస్థితి. అయితే, యువతీయువకులే కాదు అన్ని వర్గాల ప్రజలు చాక్లెట్లు కూడా తమకు నచ్చిన రీతిలో, రూపంలో ఉండాలని ఆశిస్తున్నారు. ఇలాంటి వారి ఆశల మేరకు వరంగల్‌కు చెందిన కుక్కడపు సుప్రియ చాక్లెట్లు తయారు చేస్తున్నారు. ఏ రూపంలో కావాలి, ఎంత బరువులో ఉండాలనే విషయాన్ని కొద్దిరోజుల ముందు చెబితే చాక్లెట్ తయారుచేసి ఇస్తారు. అంతేనా.. అనుకోకండి! ఫోన్‌లో లేదా ఫేస్ బుక్ పేజీలో ఆర్డర్ ఇస్తే చాలు చాక్లెట్ రెడీ అవుతోంది. ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఆర్డర్ ఇస్తే కొరియర్ ద్వారా చాక్లెట్లు పంపిస్తున్న సుప్రియ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. – వరంగల్
వరంగల్‌లోని దుర్గేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉండే కుక్కడపు సుప్రియ నగరవాసులకు కొత్త మోడల్ చాక్లెట్లను పరిచయం చేశారు. హైదరాబాద్‌లో ఇంటీరియల్ డిజైనిం గ్ కోర్సుతో పాటు బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన ఆమె చాక్లెట్ల తయారీపై ఆసక్తితో ముంబైలో చాక్లెట్ మేకింగ్ శిక్షణ పొందారు. ఆ తర్వాత సొంత ప్రతిభతో మెళకువలు నేర్చుకుని ఆమె ఎంతో ఆసక్తిగా చాక్లెట్లు తయారు చేస్తున్నారు. మిల్క్ మేడ్, బిస్కోటీస్, హనిఫిల్స్, ఫెరెరో, చాక్లెట్ బొకే వంటి వివిధ రకాల చాక్లెట్లను తయారు చేస్తూ నగరవాసుల మన్ననలు పొందుతున్నారు. వివిధ ఆకారాల్లోని చాక్లెట్లపై బర్త్‌డే గ్రీటింగ్స్, పేర్లు పొందుపరుస్తుం డడంతో సుప్రియ తయారుచేసే చాక్లెట్లు చూడగానే నోరూరేలా ఉంటాయి. చాక్లెట్లను తయారు చేయడమే కాకుండా ప్యాకింగ్ సైతం అందంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బహుమతులుగా చాక్లెట్లు ఇచ్చేందుకు వీలుగా వెరైటీ బాక్స్‌ల్లో అం దంగా ప్యాక్ చేసి వినియోగదారులకు ఇస్తున్నారు. వినియోగదారులకు కావాల్సిన మోడల్‌లో తయారు చేసి తెలిపిన అడ్రస్‌కు కొరియర్ ద్వారా చాక్లెట్లను పంపిస్తున్నారు.
నేనే పరిచయం చేశా
నగరవాసులకు కొత్త రకం చాక్లెట్లను నేనే పరిచయం చేశా. నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలన్న భావనతో వెరైటీ ఫ్లేవర్లు, ఆకారాల్లో చాక్లెట్లు తయారుచేస్తుండడంతో ఆర్డర్లు బాగా వస్తున్నాయి. మొదట్లో చాలా తక్కువగా వచ్చేవి. ఫేస్‌బుక్‌లో పేజీ ప్రారంభించాక ఇతర జిల్లాల నుంచి ఆర్డర్లు బాగా వచ్చాయి. ఇప్పుడు నగరవాసులు సైతం ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
– కుక్కడపు సుప్రియ ఫోన్ : 8008018686
అద్భుతమైన ప్యాకింగ్
చాక్లెట్ తయారు చేయడమే కాకుండా ప్యాకింగ్ సైతం ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు సుప్రియ. ప్యాకింగ్‌కు ఉపయోగించిన బాక్స్‌ను బయట పడేకుండా ఇంట్లో షోకేస్‌లో పెట్టుకునేలా ఉండడం వీటి ప్రత్యేకత. చిన్న పిల్లలకు ఇష్టమైన కార్టున్ బొమ్మల మాదిరిగా, సైకిళ్లు, బొకేల రూపంలో తయారు చేసి అందజేస్తుండడంతో వినియోగదారుల నుంచి ఆదరణ లభిస్తోంది.
ఇతర దేశాల నుంచి సైతం
మన జిల్లా నుంచే కాదు ఇతర దేశాల నుంచి సైతం చాక్లెట్లు కావాలని సుప్రియకు ఆర్డర్లు వస్తున్నాయి. డిజైన్లు, ధర ఇత్యాది వివరాలు పొందుపరుస్తూ ఆమె ఫేస్‌బుక్ పేజీ క్రియేట్ చేశారు. దీంతో ఇతర దేశాలు, రాష్ట్రాల్లో స్థిరపడిన నగర వాసులు.. వారి స్నేహితుల ద్వారా చాక్లెట్లు ఆర్డర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికా, రాజస్థాన్, అసోం, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ఆమె చాక్లెట్లు పంపించారు.