వర్ధన్నపేటను జిల్లా కేంద్రం చేయాలి
Published Tue, Sep 13 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM
వర్ధన్నపేట టౌన్ : వర్ధన్నపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ గాడిపెల్లి రాజేశ్వర్‌రావు, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మల యాకయ్య, వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్ ముత్తిరెడ్డి కేశవరెడ్డి అన్నారు. వర్ధన్నపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో అఖిలపక్షం ఆధ్వర్యంలో మండలకేంద్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి ఆరోరోజుకు చేరాయి.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలను పునర్విభజనలో ఎవరూ కోరని హన్మకొండ జిల్లా ప్రకటించి, మళ్లీ వెనక్కి తీసుకొని, వరంగల్ అర్బన్, రూరల్ పేర్లతో జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లాగా చేయాలనుకుంటే , దాని స్థానంలో వర్ధన్నపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్ధన్నపేటలో 42 ఎకరాల ప్రభుత్వ భూమి, తాత్కాలిక కార్యాలయాలకు ఆర్‌అండ్‌బీ అతిథిగృహం, 16 ఎకరాల విస్తీర్ణంలో ఎంపీడీఓ కార్యాలయం, సువిశాలమైన పోలీస్‌స్టేన్ ఉన్నాయని తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో మామునూరు ఎయిర్‌పోర్టు, వెటర్నరీ యూనివర్సిటీ, ఏనుమాముల మార్కెట్ ఉన్నాయని, 20 కిలోమీటర్ల దూరంలో రైల్వేస్టేషన్‌ఉందని, తాజాగా టెక్స్‌టైల్ పార్క్ మంజూరైందన్నారు. వరంగల్ – ఖమ్మం ప్రధాన రహదారి జాతీయ రహదారిగా మారి త్వరలో ఫోర్‌లైన్‌గా అభివృద్ధి చెందనుందన్నారు. వీటిని పరిగణలోకి తీసుకుని వర్ధన్నపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. దీక్షలో అఖిలపక్ష నాయకులు మార్త సారంగపాణి, తూళ్ల కుమారస్వామి, రామగిరి అనిల్, కొండేటి సత్యం, నాంపెల్లి యాకయ్య, నరుకుడు వెంకటయ్య, సిలువేరు కుమారస్వామి, నాగెల్లి సురేష్, కొండేటి శ్రీనివాస్, ఐత యాకాంతం కొండేటి మహేందర్, కంజర్ల మహేష్, ఎలికట్టె ముత్తయ్య పాల్గొన్నారు.
Advertisement