పదిలో నూరు శాతం ఫలితాలు సాధించాలి
ఎంఈఓలు, హెచ్‌ఎంలకు డీఈఓ సూచన
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట):
ఈ ఏడాది పదవ తరగతిలో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించేలా ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.ఎస్.గంగాభవాని సూచించారు. సోమవారం ఏలూరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఒలతో స్థానిక సెయింట్ థెరిస్సా బాలికోన్నత పాఠశాలలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు ప్రతీ రోజూ సాయంత్రం ఒక గంట అదనంగా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. 8వ తరగతి విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్ కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. అలాగే ప్లేఫీల్డ్స్‌కి ప్రధానోపాధ్యాయులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఏలూరు డీవైఈఓ ఉదయ కుమార్ మాట్లాడుతూ 10వ తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ఈ నెల 10వ తేదీ నుండి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, తరగతి గదులను ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని, వారాంతపు సమీక్షలు నిర్వహించి, విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలపై తగు సలహాలు ఇవ్వాలని సూచించారు. అలాగే బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, ప్రతీ పాఠశాలలో కిచెన్‌గార్డెన్లు ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజన పథకానికి కూరగాయలు పండించాలన్నారు. అనంతరం రిటైర్డ్ డీవైఈఓ ఏడీవీ ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సమీక్షా సమావేశంలో ఏలూరు డివిజన్‌లోని మండల విద్యాశాఖాధికారులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.